థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉండే ఒక చిన్న గ్రంథి. సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. శిశువుల్లో మెదడు అభివృద్ధి, పెరుగుదలకు సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇక పెద్దలలో అయితే జీవక్రియని నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ సమస్య ఎక్కువగా పెద్దవాళ్లలో... మరీ ముఖ్యంగా మహిళల్లో కనిపిస్తుందని అనుకుంటే పొరబడినట్టే. ఇది చిన్న పిల్లల్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇటువంటి సమస్య పిల్లల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది.


థైరాయిడ్ రకాలు


హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేవి రెండూ సాధారణ థైరాయిడ్ వ్యాధులు. తక్కువ హార్మోన్లని ఉత్పత్తి చేస్తుంటే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. ఇది జన్యుపరంగా కుటుంబంలో వస్తుంది. పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం అనేది నవజాత శిశువుల్లో గుర్తించబడే అత్యంత సాధారణ సమస్య. మహిళ గర్భం దాల్చినప్పుడు థైరాయిడ్ సమస్య వస్తే అది బిడ్డకి కూడా సంక్రమిస్తుంది. అయితే ఏ వయస్సులో ఇది బయటపడుతుందనే విషయం చెప్పడం కాస్త కష్టం.


థైరాయిడ్ గ్రంథులు అతిగా పని చేసి అవసరమైన దాని కంటే ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే హైపర్ థైరాయిడిజం సమస్య వస్తుంది. 10,000 మంది పిల్లల్లో ఒకరికి మాత్రమే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఇది చాలా అరుదైనదిగా వైద్యులు చెబుతున్నారు.


హైపోథైరాయిడిజం లక్షణాలు


పిల్లల్లో హైపోథైరాయిడిజం వచ్చినప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. అలసట, శక్తి తగ్గిపోవడం, మలబద్ధకం, పొడి చర్మం, చలిగా  అనిపించడం, కండరాల నొప్పులు, తరచుగా గాయాలు రావడం వంటివి కనిపిస్తాయి.


హైపర్ థైరాయిడిజం లక్షణాలు


ఏకాగ్రతలో ఇబ్బంది, వేడిగా అనిపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, విపరీతమైన ఆకలి, బరువు తగ్గడం, నిద్ర సమస్యలు, తట్టుకోలేనంత చలి, కండరాలు బలహీనంగా మారడం, అతిసారం వంటి లక్షణాలు కనిపిస్తే మీ పిల్లలు హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నట్టు తల్లిదండ్రులు గుర్తించాలి.


ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే శిశువైద్యుని దగ్గరకి తీసుకువెళ్లడం మంచిది. పిల్లల్లో థైరాయిడ్ స్థాయిలను తనిఖీ చేయడానికి కొన్ని పరీక్షలు చేస్తారు. సాధారణ రక్తపరీక్ష ద్వారా గుర్తించడంలో సహాయపడుతుంది. ఒకవేళ బిడ్డకి థైరాయిడ్ ఉన్నట్టు నిర్ధారణ అయితే వెంటనే చికిత్స కోసం ఎండోక్రినాలజిస్ట్ ని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే సమస్య పెరిగి బిడ్డ శరీరంలో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయి.


ఆహారాల ద్వారా థైరాయిడ్ సమస్యని కొంత వరకు తగ్గించుకోవచ్చు. ఆహారంలో అయోడిన్, కాల్షియం విటమిన్ డి తప్పనిసరిగా తీసుకోవాలి. యాపిల్, పైనాపిల్ బెర్రీలు, నారింజ వంటి పండ్లు తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు, వాల్ నట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: తిన్న వెంటనే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుందా? ఇలా చేశారంటే రిలీఫ్ గా ఉంటుంది