Night Dinner Tips For Weight Loss : బరువు తగ్గాలని ప్రయత్నించేవారు రాత్రి భోజనంలో అన్నాన్ని పూర్తిగా మానేయాలని అనుకుంటారు. కానీ అన్నం మానేయడం ఒక్కటే బరువు తగ్గడానికి పరిష్కారం కాదు. తక్కువగా ప్రాసెస్ చేసిన, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ధాన్యాలు, కూరగాయలను సరైన పరిమాణంలో తీసుకోవడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా అనిపించవచ్చు. అయితే అన్నానికి బదులుగా రాత్రి భోజనంలో చేర్చుకోగలిగే 5 హెల్తీ ఫుడ్స్ ఏంటో.. అవి బరువు తగ్గడంలో ఎలా హెల్ప్ చేస్తాయో చూసేద్దాం. 

Continues below advertisement

క్వినోవా

అన్నానికి మంచి ప్రత్యామ్నాయాల్లో క్వినోవా ఒకటి. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్‌ను పెంచుకోవాలనుకునేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో మొత్తం 9 ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల దీనిని పూర్తి ప్రోటీన్‌ వనరుగా పరిగణిస్తారు. క్వినోవాలో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇది తేలికగా, మెత్తగా ఉంటుంది. కూరగాయలు, కర్రీలు లేదా గ్రిల్డ్ ప్రోటీన్ ఫుడ్స్‌తో కలిపి రాత్రి భోజనంగా తీసుకోవచ్చు. ఇందులోని ప్రోటీన్, ఫైబర్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

Also Read : బరువు తగ్గాలన్నా.. పొట్టను తగ్గించుకోవాలన్నా.. ఈ ఎఫెక్టివ్ 7 యోగాసనాలు వేసేయండి

Continues below advertisement

కాలీఫ్లవర్ రైస్

అన్నాన్ని తగ్గించాలనుకుంటే.. కాలీఫ్లవర్ రైస్ ప్రయత్నించవచ్చు. కాలీఫ్లవర్‌ను తురిమి లేదా ప్రాసెస్ చేసి బియ్యం గింజల పరిమాణంలోకి తీసుకువస్తే కాలీఫ్లవర్ రైస్ సిద్ధమవుతుంది. ఇది అన్నంతో పోలిస్తే తక్కువ క్యాలరీలు కలిగి ఉండటంతో పాటు విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలను అందిస్తుంది. కూరగాయలు, ప్రోటీన్‌ ఫుడ్స్‌తో కలిపి తేలికపాటి డిన్నర్‌గా తీసుకోవచ్చు. అయితే బరువు తగ్గడంలో మొత్తం రోజువారీ కేలరీలు, ఆహార పరిమాణం, శారీరక శ్రమ కూడా ముఖ్యమే.

గోధుమ రవ్వ

గోధుమ రవ్వ కూడా కూడా అన్నానికి మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఫైబర్‌ ఎక్కువగా ఉండటంతో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి క్రమంగా శక్తిని అందించడంలో సహాయపడతాయి. కూరగాయలతో కలిపి వెజిటబుల్ కిచిడీగా తయారు చేసుకోవచ్చు. ఫైబర్ కారణంగా జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలగవచ్చు.

Also Read : 4 నెలల్లో 15 కిలోల బరువు తగ్గిన ఇన్‌ఫ్లుయెన్సర్.. బరువు తగ్గేందుకు ఫాలో అయి 5 చిట్కాలు ఇవే

బార్లీ

బార్లీలో బీటా-గ్లూకాన్‌ వంటి ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంలో భాగం. బార్లీకి కొద్దిగా నమిలే టెక్స్చర్‌, నట్టి రుచి ఉంటుంది. దీనిని సూప్స్, సలాడ్స్ లేదా గ్రెయిన్ బౌల్స్‌లో చేర్చుకోవచ్చు. ఫైబర్‌ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండిన భావనకు సహాయపడుతుంది. రాత్రి భోజనంలో సరైన పరిమాణంలో తీసుకుంటే ఓవర్‌ఈటింగ్‌ కంట్రోల్ చేయవచ్చు. 

మిల్లెట్స్

కొర్రలు, ఊదలు, సామలు వంటి మిల్లెట్స్ ప్రస్తుతం ఆరోగ్యకరమైన ధాన్యాలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వీటిలో ఫైబర్‌తో పాటు వివిధ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. మిల్లెట్స్‌ను అన్నానికి బదులుగా తీసుకోవచ్చు. వీటితో మిల్లెట్ ఖిచ్డీ, మిల్లెట్ పులావ్ లేదా గ్రెయిన్ బౌల్ తయారు చేసుకోవచ్చు. ఫైబర్‌ ఉండటం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. అయితే బరువు తగ్గాలనుకునేవారు మిల్లెట్స్ కూడా మితంగానే తీసుకోవాలి.

Also Read : బరువు తగ్గాలని షుగర్స్ మానేశారా? స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఈ హెల్తీ ఆప్షన్స్ ట్రై చేయండి

బరువు తగ్గాలంటే గుర్తించుకోవాల్సిన విషయం.. 

అన్నాన్ని క్వినోవా, మిల్లెట్స్ లేదా గోధుమ రవ్వతో మార్చడం వల్ల మాత్రమే బరువు తగ్గరు. మీరు తీసుకునే మొత్తం క్యాలరీలు, ఆహార పరిమాణం, ప్రోటీన్, ఫైబర్, శారీరక శ్రమ, నిద్ర వంటి అంశాలన్నీ బరువు తగ్గడంలో పాత్ర పోషిస్తాయి. అలాగే రాత్రి భోజనంలో కూరగాయలు, తగినంత ప్రోటీన్‌ ఉండేలా చూసుకుంటే డిన్నర్ మరింత బ్యాలెన్స్​డ్​గా ఉంటుంది. 

Also Read : పిల్లల్లో బరువు పెరుగుదలకు(Obesity) నిద్రలేమి కూడా కారణమేనా? వైద్యుల హెచ్చరికలు ఇవే