Watermelon Rind for Healthy Life : పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సమ్మర్లో డీ హైడ్రేషన్నుంచి తప్పించుకునేందుకు చాలామంది దీనిని తింటారు. పుచ్చకాయలోని 90 శాతం నీరు మీరు నిర్జలీకరణానికి గురికాకుండా రక్షిస్తుంది. అందుకే దీనిని పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ తింటారు. పైగా ఇది ఆరోగ్యానికి కూడా చాలామంచిది. వివిధ ఆరోగ్య సమస్యలనుంచి పుచ్చకాయ మనల్ని రక్షిస్తుంది. అందుకే మధుమేహమున్నవారు కూడా తగిన మోతాదులో దీనిని తింటారు. సాధారణంగా పుచ్చకాయ గుజ్జును తిని తొక్కను పడేస్తూ ఉంటాము. అయితే మీరు కూడా అదే రకమైతే.. పుచ్చకాయ తొక్కలోని ప్రయోజనాలు తెలుసుకోవాలి అంటున్నారు నిపుణులు.
పుచ్చకాయ పైభాగం కాస్త గట్టిగా.. పచ్చని రంగులో ఉంటుంది. దానిలోపల ఎర్రని భాగం, గింజలతో నిండి ఉంటుంది. లోపలి భాగాన్ని తినేసి.. బయట భాగాన్ని పడేస్తూ ఉంటాము. అయితే పుచ్చకాయ తొక్క కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది అంటుంది ఆయుర్వేదం. దీనిలో విటమిన్ ఎ, సి, పొటాషియం, ఐరన్, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. వీటిలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది తినకూడదు అనుకుంటారు.
పుచ్చకాయ తొక్కలోని పోషకాలు ఇవే
పుచ్చకాయ తొక్కలు పోషకాలను కలిగి ఉండటమే కాకుండా.. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లతో నిండి ఉంటుంది. పైగా దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. పలు రకాల విటమిన్లు, పొటాషియం, జింక్ అధిక మొత్తంలో ఉంటాయి. పుచ్చకాయ తొక్కలో క్లోరోఫిల్, సిట్రులిన్, లైకోపీన్, అమైనో ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తొక్కను మీరు నేరుగా తినలేకపోయినా.. దానిని రుచిగా మార్చుకునే విధానాలు కూడా చాలా ఉన్నాయి.
ఇలా కూడా తీసుకోవచ్చు..
పుచ్చకాయ తొక్కలోని పోషకాలు గుర్తించిన పలు దేశాల్లో దీనిని పలు రూపాలలో తీసుకుంటారు. మీరు కూడా తొక్కలను తినలేము అనుకుంటే.. వివిధ రకాలుగా దానిని మీ డైట్లో తీసుకోవచ్చు. కొందరు పుచ్చకాయ తొక్కలతో ఊరగాయ చేసుకుంటారు. ఇలా చేసుకోవడం వల్ల వాటి రుచి చాలా మారిపోతుంది. ఒక్కసారి తింటే మళ్లీ ఇంకోసారి తినాలనే కోరికను ఇది కలిగిస్తుంది. మరికొందరు సమ్మర్ డ్రింక్‌గా తీసుకుంటారు. పుచ్చకాయ తొక్కలను జ్యూస్, మిక్స్, స్మూతీలలో ఉపయోగిస్తారు. ఈ తరహా రెసిపీలు కూడా ఆరోగ్యానికి మంచి చేస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
పుచ్చకాయలోని విటమిన్స్, మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పుచ్చకాయ తొక్కలు తినడం వల్ల సిట్రూలిన్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్లో ఉంచడమే కాకుండా.. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
Also Read : రోజూ ఈ పనులు చేస్తే.. ఆరోగ్యకరమైన దీర్ఘాయువు మీ సొంతమవుతుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.