రోజును ఆరోగ్యకరమైన ఆహారంతో ప్రారంభిస్తే ఆ రోజంతా మీరు ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో బొప్పాయి ఒకటి. ఇది పోషకాలు నిండిన పండు. ఖాళీ పొట్టతో పరగడుపున దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ A,B,C ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే బొప్పాయిలో లూటిన్, జియాక్సంతిన్ అనే కెరటోనోయిడ్లు కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జీర్ణ క్రియకు ఎంతో సహాయపడతాయి. బొప్పాయిని పరగడుపున తినడం వల్ల ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.


రోజూ ఉదయాన్నే బొప్పాయి తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. తరచూ మలబద్ధకంతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ పొట్టతో బొప్పాయిని తినాలి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. పేగు కదలికలను చురుగ్గా చేస్తుంది. మలబద్దకాన్ని అరికడుతుంది. అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి ఉత్తమమైన పండు. రోజూ ఉదయాన్నే బొప్పాయి తింటే బరువు తగ్గే ప్రక్రియ సులభతరం అవుతుంది. దీనిలో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాలం పాటు పొట్ట నిండిన భావన ఉంటుంది. దీనివల్ల మీరు ఇతర చిరుతిళ్లు తినరు. ఆకలి కూడా వేయదు. అతిగా తినకుండా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.


బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. ఉదయాన్నే ఖాళీ పొట్టతో బొప్పాయిని తింటే శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. 


శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో  కొలెస్ట్రాల్‌ను పేరుకుపోకుండా నియంత్రించడం చాలా ముఖ్యం. బొప్పాయిలో ఉండే ఫైబర్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ పండులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును రాకుండా అడ్డుకొని నియంత్రిస్తుంది. రోజూ ఉదయాన్నే బొప్పాయి తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.


ప్రతిరోజూ బొప్పాయి తినేవారి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ కణాలను రిపేర్ చేసే విటమిన్ సి దీంట్లో పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి. తద్వారా చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. అకాల వృద్ధాప్యం నుండి చర్మాన్ని ఇది రక్షిస్తుంది. బొప్పాయిని తింటే మొటిమలు, పిగ్మెంటేషన్, ముడతలు, గీతలు వంటివి రాకుండా ఉంటాయి. 



Also read: బీపీ పెరిగితే కంటిలో కనిపించే లక్షణాలు ఇవే































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.