Baby Planning: పెళ్లయిన ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది. ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువ కావడంతో గర్భం ధరించే ప్రక్రియను వాయిదా వేసుకుంటున్నారు. బిడ్డను కనిపెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అనుకున్నాకే బిడ్డను ప్లాన్ చేస్తున్నారు. అయితే గర్భం ధరించేందుకు సిద్దమయ్యాక కొన్ని రకాల పనులు చేయకూడదని చెబుతున్నారు వైద్యులు. ఆ పనులు గర్భం ధరించడంపై, బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారాలు గర్భం ధరించే అవకాశాలు తగ్గించేస్తాయి. ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం తరచూ సెక్స్ చేసే వారిలో 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు గర్భం దాల్చే అవకాశం 80 శాతం ఉంటుంది. ఆ అవకాశాలు తగ్గకుండా ఉండాలంటే ఈ అలవాట్లను మహిళలు వదిలేయాలి.
ధూమపానం వద్దు
మగవారిలోనే కాదు, ఆడవారిలో కూడా ధూమపానం పెరిగిపోతోంది.గర్భం ధరించాలనుకుంటున్న స్త్రీలు ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇది వారిలో అండాల సంఖ్యను తగ్గిస్తుంది. అలాగే అండాల్లో జన్యుపరమైన అసాధారణతలు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇలాంటి అండాలు ఫలదీకణం చెందిన పుట్టుకతో బిడ్డలో లోపాలు వస్తాయి. నెలలు నిండకుండానే ప్రసవం కావడం, ప్రసవం జరిగేటప్పుడు బిడ్డకు హాని కలగడం వంటివి జరుగవచ్చు.
లైంగిక వ్యాధులు
కొందరిలో వారికి తెలియకండా లైంగిక ఇన్ఫెక్షన్లు ఉంటాయి. అలాంటివేవీ లేవని వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకున్నాకే గర్భం ధరించేందుకు సిద్ధమవ్వాలి. గోనేరియా, క్లామిడియా వంటి లైంగిక వ్యాధులు గర్భధారణను కష్టతరం చేస్తాయి. ఇవి ఫాలోపియన్ ట్యూబులను దెబ్బతీస్తాయి.
ప్లాస్టిక్ వాడకం
గర్భం ధరించడానికి ముందే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ సంచులు,డబ్బాుల పక్కన పడేయాలి. ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్లు తాగడం, ప్లాస్టిక్ డబ్బాల్లో వేడిగా ఉన్న పదార్థాలు వేసుకుని తినడం మానేయాలి. సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు శరీరంలో చేరితే చాలా ప్రమాదం. అండాశయాలు ,మెదడు హార్మోన్ల పనితీరుకు అంతరాయం కలిగిస్తాయివి.
ప్రాసెస్డ్ ఫుడ్
బయట అధికంగా ప్రాసెస్డ్ మాంసాహారం దొరుకుతుంది. వాటిని తినడం మానేయాలి. తాజా చికెన్ ను తెచ్చుకుని ఇంట్లోనే వండుకుని తినడం ఉత్తమం. ప్రాసెస్డ్ ఫుడ్ గర్భిణులకు చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. నాణ్యమైన పిండం ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కాబట్టి గర్భం ధరించాలని అనుకున్నప్పట్నించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం మొదలుపెట్టాలి.
Also read: ఈ పండ్లు తింటే రక్తంలో గడ్డలు ఇట్టే కరిగిపోతాయి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.