Morning Walk Benefits on Barefoot : ఉదయం నడక ఆరోగ్యానికి మంచిది. అయితే మార్నింగ్ వాక్ గడ్డిపై చేస్తే చాలామంచిదని చెప్తున్నారు. అవును చెప్పులు లేకుండా ఉదయాన్నే గడ్డిపై నడిస్తే ఆరోగ్యానికి చాలామంచిదట. శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడాన్ని వైద్య పరిభాషలో ఎర్థింగ్ లేదా గ్రౌండింగ్ అంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదని అనేక పరిశోధనల్లో కూడా తేలింది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 30 నిమిషాల వరకు గడ్డిపై నడవాలట. పార్క్ పరిశుభ్రంగా ఉండి, గడ్డి బాగా ఉంటే.. కొన్ని నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవాలని సూచిస్తున్నారు. న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ ప్రివెంటివ్ హెల్త్ అండ్ వెల్నెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సోనియా ఈ విషయం తెలిపారు. ఉదయం నడక సమయంలో కొన్ని నిమిషాల పాటు గడ్డిపై చెప్పులు లేకుండా నడిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. దాని ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా రెగ్యులర్ వాక్ చేస్తారని చెప్తున్నారు.

మానసిక ఆరోగ్యానికై

గడ్డిపై చెప్పులు లేకుండా నడవడాన్ని నేచురోపతి అని కూడా చెప్తారు. గడ్డిపై చెప్పులు లేకుండా నడిచినప్పుడు.. పాదాల నాడీలపై ఒత్తిడి వస్తుంది. ఇది అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను బాగా తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు అందుతాయి.

జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నేలపై చెప్పులు లేకుండా నడవడం మూడ్‌ను మెరుగుపరుస్తుంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. పాదాల కింద చల్లని, మృదువైన గడ్డి మనస్సును శాంతింపజేస్తుంది. చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది అనే అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రచురించింది.

ఇది సిటీల్లో ఉండేవారికి కాస్త కష్టమే. ఎందుకంటే నగరాల్లో పచ్చదనం కాస్త తక్కువగా ఉంటుంది. అలాగే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి దగ్గర్లోని పార్క్​లో గడ్డిపై చెప్పులు లేకుండా నడుస్తూ ఉండండి. ఇది నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల రోగనిరోధక శక్తికి కూడా బలపడుతుంది. 

గుండె ఆరోగ్యానికై.. 

గ్రౌండింగ్‌ను గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి హెల్ప్ చేస్తుందని నిపుణులు గుర్తించారు. జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని రాాశారు. గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

కండరాలకు బలం

గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీర సమతుల్యత పెరుగుతుంది. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎక్సర్‌సైజ్ ప్రకారం.. చెప్పులు లేకుండా గడ్డిపై నడవడం.. పాదాలు, దిగువ కాళ్ల చిన్న కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, USA పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో.. భూమికి కనెక్ట్ అవ్వడం వల్ల ప్రజల శరీరంలో మంట తగ్గుతుందని గుర్తించారు. ఇది ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుందని కనుగొన్నారు.

గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం ద్వారా శరీరాన్ని వ్యాధులు తగ్గుతాయి. జర్నల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ రీసెర్చ్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నేలపై పడుకోవడం వల్ల శరీరంలో నొప్పి, వాపు తగ్గుతుంది. భూమిపై ఉన్న ఎలక్ట్రాన్లు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.