సింహం అడవికి రారాజుగా పిలువబడుతుంది. తనకు ఆకలేస్తే.. ఎంతటి జంతువునైనా వెంటాడి, వేటాడి చంపి తింటుంది. కానీ, పరిస్థితులు అన్నిసార్లు అనుకూలంగా ఉండవు కదా! ఒక్కోసారి బలహీనుడు సైతం బలవంతుడిని చావుదెబ్బ కొట్టే అవకాశం వస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఏనుగు, సింహం వీడియోను చూస్తే ముమ్మాటికీ వాస్తవం అనిపిస్తుంది.  


ఏనుగులకు సహజ శత్రువుల స్థానంలో ఫస్ట్ ప్లేస్ సింహాలకే ఉంటుంది. అత్యంత బలమైన ఏనుగులను సైతం దాడి చేసి చంపేస్తాయి సింహాలు.  ఏనుగులు పెద్ద జంతువు కావడం మూలంగా ఒక్కదాన్ని చంపితే..  రోజుల తరబడి ఆహారం కోసం వేటాడాల్సిన అవసరం ఉండదు. అయితే, తమ అహంకారం కోసం వేటను కొనసాగించే సింహాలకు ఏనుగులను చంపడం అంత తేలికైన విషయం కాదు. ఏనుగులు వాస్తవానికి శాకాహార జంతువులు, శాంతియువత జీవులు. తమ పిల్లలను బెదిరించడం లేదంటే ప్రమాదం ఉందని భావిస్తే తప్ప ఇతర జంతువుల మీద దాడి చేయవు. అకారణంగా ఎదుటి జీవులకు హాని తలపెట్టవు.   


తాజాగా ఓ ఏనుగు సింహంపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘యానిమల్స్ ఇన్ ది నేచర్‌ టుడే’ అనే పేజీ షేర్ చేసింది. ఈ వీడియోలో ఒక సింహం ఇసుక మధ్యలో కూర్చుని, వేటాడేందుకు రెడీ అయ్యింది. తీక్షణంగా ఎదుటి జంతువులను గమనిస్తున్నది. ఏ జంతువును ఆహారంగా తీసుకోవాలా? అని ఆలోచిస్తున్నది. వాస్తవానికి ఒంటరి సింహం ఏనుగుపై దాడికి యత్నం చేయదు. సుమారు అర డజన్ సింహాలు ఉన్నప్పుడే ఏనుగు మీద దాడి చేస్తాయి.  


ఒంటరిగా కూర్చొని దాడికి వ్యూహం సిద్ధం చేస్తున్న సింహాన్ని గమనించిన ఏనుగు.. దానిపై దాడి చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. సింహం తన వెనుక నుంచి వస్తున్న ఏనుగును గమనించి తీవ్రంగా భయపడింది. ఠీవీగా నడుచుకుంటూ వచ్చే మృగరాజు.. పిల్లిలా వణికిపోతూ పరిగెత్తింది. ముందున్న మరికొన్న ఏనుగులు సైతం సింహంపై దాడికి యత్నించాయి. అన్ని వైపుల నుంచి ప్రమాదం పొంచి ఉందని గ్రహించి సింహం అక్కడి నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగు పెట్టింది. ఎలాంటి ఇబ్బంది లేని మరో చోటుకు వెళ్లిపోయింది.






ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. ఇప్పటికే ఈ వీడియోకు 122K  పైగా వ్యూస్ వచ్చాయి. 1,600 లైక్‌లు వచ్చాయి. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సింహం భయాన్ని చూసి నవ్వుకుంటున్నారు.