Ganesh Chaturthi Significance : హిందువుల పండుగల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సంతోషంగా చేసుకునే వేడుకల్లో వినాయక చవితి (Vinayaka Chavithi 2025) ఒకటి. దీనినే గణేశ్ చతుర్థి అని కూడా అంటారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా గణేశుడి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటారు. మండపాలు కట్టి, విగ్రహాలు పెట్టి, నైవేద్యాలు చేసి, పూజలో పాల్గొని అబ్బో చిన్న కథ కాదు. ఎంతో హడావుడి ఉంటుంది. కేవలం ఇంట్లోనే పూజనే కాదు.. కమ్యూనిటీల్లో కూడా ఉత్సవాలు ఓ రేంజ్​లో ఉంటాయి. 

తలచిన పనుల్లో ఎలాంటి విఘ్నాలు జరగకూడదని.. జ్ఞానం, సంపద, శ్రేయస్సు కలగాలని వినాయకుడికి పూజలు చేస్తారు. ఈ వినాయక చవితి కథ గురించి దాదాపు అందరికీ తెలుసు కానీ.. దానిని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము.. దాని చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి? గణేశ్ చతుర్థి గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి? అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. 

వినాయక చవితి చరిత్ర (Vinayaka Chavithi History)

పురాణాల ప్రకారం పార్వతి దేవి కుమారుడైన గణేశుడు శివుని చేతిలో తల కోల్పోతాడు. పార్వతి దేవి ఆగ్రహించడంతో ఉత్తరం వైపు పడుకొన్న ఏనుగు తలను తీసుకువచ్చి.. గణేశుడికి అమర్చుతాడు శివయ్య. ఈ కథ అందరికీ తెలుసు. అయితే ఈ పండుగకు ప్రజల్లో తగినంత గుర్తింపు తెచ్చింది మాత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్తారు. అందుకే మహారాష్ట్ర సైడ్ గణనాథుడిని ఎక్కువగా కొలుస్తారు.

బాలగంగాధర్ తిలక్​ కూడా ఈ పండుగను స్వాతంత్య్ర సమయంలో ప్రజలను ఓ తాటిపైకి తీసుకురావడానికి ఉత్సవంగా చేయడం ప్రారంభించారని చెప్తారు. అంటే వినాయక చవితిని ఎవరి ఇళ్లల్లో వాళ్లు ముందు నుంచే చేసుకునేవారు. కానీ బాలగంగాధర్ తిలక్​ వల్ల కమ్యూనిటీలుగా ఏర్పడి పండుగను చేసుకునే కల్చర్ ప్రారంభమైందని చెప్తారు. 

వినాయక చవితి ప్రాముఖ్యత (Vinayaka Chavithi Significance)

వినాయకుడిని పూజించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. జ్ఞానం, శాంతి, సంపదను ఇచ్చేవాడిగా కొలుస్తారు. పిల్లలు చదువుల్లో రాణించాలని కోరుకుంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు, విందులు చేసుకుంటారు. ఇది ఐక్యతను పెంచుతుంది. పైగా వినాయకుడికి పెట్టే ప్రసాదాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. చవితి సమయంలో వర్షాలు వస్తాయి కాబట్టి ఆ సమయంలో రోగనిరోధక శక్తి పెంచడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. 

చవితి గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు (Interesting Points)

దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వినాయకచవితి జరుపుకుంటారు. గణేశుడిని పూజించకుండా ఏ పూజ ప్రారంభించరు. నేపాల్, థాయ్​లాండ్, ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా వినాయకుడిని కొలుస్తారు. అయితే వివిధ పేర్లతో ఆయన్ని పిలుచుకుంటూ.. పూజలు చేస్తారు. 

ఈ పండుగ కేవలం పూజలు, ప్రసాదాలు, సంబరాలకే పరిమితం కాదు.. భక్తికి, ఐక్యతకు, సంప్రదాయాలకు ప్రతీకగా చెప్తారు. అందుకే ఈ వినాయక చవితి 2025లో ఆధ్యాత్మికతతో పాల్గొంటూ.. పర్యావరణ హిత సెలబ్రేషన్స్ చేసుకుంటే గణపతి బప్పా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.