Vinayaka Chavithi Special Modaks : వినాయక చవితి సందర్భంగా చాలామంది పలు వంటకాలు చేస్తారు. ఈ సమయంలో గణనాథుడికి ఇష్టమైన మోదకాలు చేయాలనుకుంటున్నారా? అయితే పూజా సమయంలో సింపుల్​గా, టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఆవిరి మోదకాలు చేసేయండి. వీటిని చేయడం చాలా సింపుల్. మరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

బియ్యం పిండి - 1 కప్పు

నీరు - 1.5 కప్పులు

నెయ్యి - పావు టీస్పూన్ 

ఉప్పు - రుచికి తిగినంత

స్వీట్ స్టఫింగ్ కోసం.. 

తురిమిన కొబ్బరి - 1 కప్పు

బెల్లం - 1 కప్పు సన్నగా తరిగినది

యాలకుల పొడి - 1 టీస్పూన్

జాజికాయ పొడి - పావుటీస్పూన్

గసగసాలు  - అర టీస్పూన్

నెయ్యి - అర టీస్పూన్

బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం

ముందుగా మోదకం లోపల పెట్టే స్టఫ్ రెడీ చేసుకోవాలి. పాన్​లో నెయ్యి వేసి వేడిచేయండి. మంటను తగ్గించి.. దానిలో గసగసాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత తురిమిన కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసుకోవాలి. అన్నింటినీ బాగా కలిపి.. చిన్న మంట మీద ఉడికించాలి. బెల్లం కరుగుతుంది. బెల్లంలోని తేమ ఆరిపోయే వరకు 7 నుంచి 9 నిమిషాలు ఉడికించాలి. అనంతరం స్టౌవ్ ఆపేయాలి. బెల్లం గట్టిపడేలా ఉడికించకూడదు. ఈ మిశ్రమాన్ని చల్లార్చడానికి పక్కన పెట్టాలి. అనంతరం ఇది మరింత చిక్కగా మారుతుంది. పలుచగా ఉంటే కాస్త బియ్యం పిండిన కూడా వేసి కలుపుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. 

ఇప్పుడు మోదకం తయారు చేసేందుకు బియ్యం పిండిని సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్‌లో నీరు వేసి దానిలో నూనె లేదా నెయ్యి వేయాలి. ఉప్పు కూడా వేసి నీటిని మరిగించాలి. మంట తగ్గించి.. బియ్యం పిండిని నెమ్మదిగా వేయండి. పిండిని నీటిలో ఉండలు లేకుండా కలపండి. నీటిలో బాగా కలిసిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు దానిపై మూత పెట్టి 5 నిమిషాలు పక్క పెట్టాలి. అనంతరం దానిని ఓ ప్లేట్​లో తీసుకోవాలి. పిండిని చేతులతో బాగా కలపాలి. పిండి వేడిగా ఉంటుంది కాబట్టి చేతులకు కాస్త నీరు అద్దుకొని కలపాలి. ఈ  పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఉండలు ఆరిపోకుండా కిచెన్ టవల్​తో కప్పి పక్కన పెట్టుకోవాలి. 

మోదకాల తయారీ.. 

ఇప్పుడు ఓ ఉండను తీసుకుని.. దానిలో ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమం కాస్త ఉంచి మోదకాలుగా ఒత్తుకోవాలి. మోదక్ ఆకారంలో చేసి.. నూనె లేదా నెయ్యితో దానిని క్లోజ్ చేయాలి. మిగిలినవి చేసుకునేవరకు తయారు చేసిన మోదకాలపై క్లాత్ కప్పి ఉంచాలి. అన్ని సిద్ధమైన తర్వాత ప్రెజర్ కుక్కర్ లేదా ఒక ఇన్‌స్టంట్ పాట్ స్టీల్ ఇన్‌సర్ట్‌లో 2 నుంచి 2.5 కప్పుల నీరు తీసుకోంవాలి. ఇప్పుడు నీటిని మరిగించుకోవాలి. ఓ గిన్నెలో మోదకాలు వేసి.. కవర్ చేసి.. ఆ నీటిలో ప్లేస్ చేయాలి. పది నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే వేడి వేడి టేస్టీ మోదకాలు రెడీ. ఆవిరితో ఉడికించిన తర్వాత.. మోదక్ పట్టుకుంటే జిగటగా అనిపించకూడదు. అవి జిగటగా అనిపిస్తే.. మరికొన్ని నిమిషాలు ఉడికించాలి.