బిర్యానీలంటే చెవి కోసుకునే వాళ్లు, ఆరోగ్యం కోసం కూడా కాస్త ఆలోచించాలి. జీర్ణవ్యవస్థకు మేలు చేసే కొన్ని రకాల వంటకాలను కూడా తినాల్సిందే. కేవలం నాలుక ఇచ్చే రుచి కోసమే కాదు, ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవాలి.అందుకే పొట్టను క్లీన్ చేసే ఆహారాలను అప్పుడప్పుడు తినాలి. అలాంటి ఆహారమే వామన్నం. వాములో ఉండే  ఔషధ గుణాలు ఇన్నీ అన్నీ కావు. వారాకోసారి వాము అన్నాన్ని పిల్లలు, పెద్దలు అందరూ తింటే చాలా మంచిది. వాము అన్నాన్ని చేయడం కూడా చాలా సులువు. వండిన అన్నం ఉంటే అయిదు  నిమిషాల్లో రెడీ అయిపోతుంది. 


కావాల్సిన పదార్థాలు
వండిన అన్నం - ఒక కప్పు
వాము - ఒక టీస్పూను
ఎండు మిర్చి - రెండు
కరివేపాకులు -  అరకప్పు
జీలకర్ర - ఒక  టీ స్పూను
పసుపు - అర టీ స్పూను
(పసుపు నచ్చితే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా ఫర్వాలేదు)
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు టీ స్పూనులు


తయారీ ఇలా
1. అన్నం ముందే వండి పెట్టుకోవాలి. ముద్ద అవ్వకుండా పొడిపొడిగా ఉండేలా ప్లేటులో పరుచుకోవాలి.
2. స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో జీలకర్ర, వాము, ఎండు మిర్చి వేసి వేయించాలి. 
3. వెంటనే కరివేపాకు, పసుపు కూడా వేసి వేయించాలి. 
4. ఏవీ మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోతే రుచి మారిపోతుంది. 
5. ఈ మిశ్రమాన్ని అన్నంపై వేసి ఉప్పు చల్లి కలపాలి. పులిహోరలాగే కలిపేసుకుని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. 
6. ఎండు మిర్చికి బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. మరింత స్పైసీగా ఉంటుంది. కారం, మసాలా వంటివి జోడించకూడదు. 
7. పిల్లలకు పెట్టేటప్పుడు ఎండు మిర్చి వేయడమే మంచిది. 


ఎన్ని లాభాలో
1. వామన్నం తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చాలా బాధలు తొలగిపోతాయి. ఆహారం అరగకపోవడం, గ్యాస్, ఉబ్బరం వంటివి సమస్యలు తగ్గుముఖం పడతాయి. 
2. పిల్లలకు అరగకపోవడం వల్ల కడుపునొప్పి వస్తుంటుంది. అలాంటి నొప్పులు రాకుండా ఉండాలంటే వారానికోసారైనా వాము అన్నం పెట్టాల్సిందే. 
3. పుల్లటి త్రేన్పులు, ఎసిడిటీ వేధిస్తున్నప్పుడు స్పూను వాము బాగా నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. 
4. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్న వారు కూడా తరచూ వామును తింటే మంచిది. వామును నేరుగా తినలేకపోతే వాము అన్నాన్ని ప్రయత్నించవచ్చు. 
5. మలబద్ధకం సమస్యను కూడా వాము తీర్చేస్తుంది. ః
6. పాలిచ్చే తల్లులు వాము అన్నం తినడం వల్ల పాల ఉత్పత్తి బావుంటుంది. 
7. వాములో యాంటీ ఆక్సిడెంట్, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. 


Also read: ఉలవలు మెనూలో చేర్చుకోవాల్సిందే, డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది


Also read: వాకింగ్‌తోనే మూడు నెలల్లో 30 కిలోలు తగ్గొచ్చు తెలుసా? ఇలా వాకింగ్ చేస్తే ఇది సాధ్యమే