ముద్రాలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే నత్తలు.. ఎవరికీ హాని చేయవనే సంగతి తెలిసిందే. పైగా, అది పాములా వేగంగా కదిలి కాటేసే జీవి కూడా కాదు. అయితే, అమెరికా అధికారులు ఓ నత్తను చూడగానే షాకయ్యారు. హుటాహుటిన వేలాది మందిని క్వారంటైన్‌కు తరలించారు. మొత్తం హెల్త్ డిపార్ట్‌మెంట్‌ను అలర్ట్ చేశారు. ఇంతకీ ఆ నత్తను చూసి అధికారులు ఎందుకు కంగారు పడుతున్నారు? నత్తకు క్వారంటైన్‌కు సంబంధం ఏమిటనేగా మీ సందేహం. అయితే, ఫ్లోరిడాలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సిందే. 


గత వారం ఫ్లొరిడాలోని టంపాకు 38 మైళ్ల దూరంలో ఉన్న న్యూపోర్ట్ రిచీలో ఒక పెద్ద ఆఫ్రికన్ నత్త కనిపించింది. దాన్ని చూడగానే అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఆ నత్తలు ఉంటున్న పరిసరాల్లోని వేలాది మంది ప్రజలు, రైతులను క్వారంటైన్‌కు పంపించారు. ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్ (FDACS) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆఫ్రికన్ నత్త ఎక్కువగా నేలపైనే జీవిస్తుందని, ఇది ప్రపంచంలోనే అత్యంత హానికరమైనదని తెలిపారు. ఎందుకంటే, ఈ నత్త.. మెదడవాపుకు కారణమయ్యే ‘మెనింజైటిస్‌’ను వ్యాపిస్తుంది. 


రిచీలోని ఓ తోటమాలి ముందుగా ఈ నత్తను గుర్తించాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే, ఎవరో ఆఫ్రికా నుంచి వీటిని అక్రమ మార్గంలో అమెరికాకు తీసుకొచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ఇటీవల ఆఫ్రికా నుంచి మియామీకి వెళ్లే విమానంలో ఓ మహిళ నత్తలను తన స్కర్ట్‌లో దాచుకుని స్మగ్లింగ్ చేసినట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం ఆమె కోసం గాలిస్తున్నామని తెలిపారు.


ఈ నత్త సుమారు 500 రకాల వృక్ష జాతులకు నష్టం కలిగిస్తుందని FDACS హెచ్చరించింది. అంతేగాక ఈ నత్తల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి నత్తలు ఎవరికైనా కనిపిస్తే, వాటిని ముట్టుకోవద్దని, వెంటనే అత్యవసర సేవల విభాగానికి సమాచారం అందించాలని అధికారులు ప్రకటించారు. 


ఆఫ్రికాకు చెందిన ఈ నత్తల్లో ర్యా్ట్ లంగ్ వార్మ్ అనే పరాన్నజీవి ఉంటుందని, అది మనుషుల్లో మెనింజైటిస్‌ను ప్రేరేపిస్తుందని అధికారులు తెలిపారు. దీనివల్ల బాధితులు మెదడువాపుకు గురవ్వుతారని వెల్లడించింది. నత్తలను ఆహారంగా తీసుకొనేవారు బాగా ఉడకబెట్టిన తర్వాతే తినాలని హెచ్చరించారు. పచ్చిగా ఉన్నట్లయితే ఆ పరాన్న జీవి కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. 


అధికారులు ప్రస్తుతం న్యూపోర్ట్ రిచీని జల్లెడపడుతున్నారు. అలాంటి నత్తల కోసం పరిసర ప్రాంతాలను గాలిస్తున్నారు. ఆయా పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలను క్వారంటైన్‌కు పంపించి, వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రజల ఇళ్ల వద్ద మొలస్కిసైడ్‌లను స్ప్రే చేస్తున్నారు. ఆ నత్తలన్నీ పూర్తిగా చనిపోయాయని నిర్ధరించుకున్న తర్వాతే స్థానికులకు క్వారంటైన్ నుంచి విముక్తి లభిస్తుంది. 1960ల నాటి నుంచి కొందరు ఆ నత్తలను పెంచుకుంటున్నారు. జెయింట్ ఆఫ్రికన్ నత్తలపై మతపరమైన విశ్వాసం ఉండటంతో కొందరు అధికారుల కళ్లుగప్పి అమెరికాకు తీసుకొస్తున్నారు. దీంతో ఈ నత్తలను అమెరికా 1969లోనే నిషేదించింది. 


Also Read: దెయ్యాలు ఉన్నాయా? ఆత్మలు కనిపిస్తాయా? ఈ వాస్తవాలు మిమ్మల్ని షేక్ చేస్తాయ్!


2011లో మియామి-డేడ్ కౌంటీలో కూడా ఇలాంటి నత్తలు ప్రత్యక్షమయ్యాయి. 2011లో కూడా ఈ నత్తలు ఇబ్బందిపడ్డాయి. నత్తల ఉనికి గురించి తెలిసినప్పుడల్లా అధికారులు అప్రమత్తమై వాటిని చంపేస్తున్నారు. నాలుగు నెలల వయస్సులోనే ఈ నత్త ఒకేసారి వేలాది గుడ్లు పెట్టగలదు. ఒక్కో నత్త సుమారు 8 అంగుళాల పొడవు ఉంటుంది. ఇందులో మాంసం ఎక్కువగా ఉంటుందనే కారణంతో చాలామంది ఇష్టంగా తిని సమస్యల కొనితెచ్చుకుంటున్నారు. ఈ నత్తలు ఎక్కడైనా జీవించేస్తాయి. చివరికి కార్లకు కూడా అతుక్కుపోయి ప్రయాణిస్తాయి. వాటిని చంపకుండా మట్టిలో పాతేసినా ఏడాది పాటు జీవించేస్తాయి. ఈ నత్తల డొల్ల ముదురు గోదుమ రంగులో ఉంటాయి. వాటిపై నిలువు చారలు ఉంటాయి. ఇవి ఐదు నుంచి ఏడేళ్ల వరకు జీవిస్తాయి. వాతావరణం అనుకూలంగా ఉండి, తగిన ఆహారం లభిస్తే.. పదేళ్ల వరకు కూడా జీవిస్తాయి. మీకు అలాంటి నత్తలు కనిపిస్తే తినేయకండి. వీలైతే వాటికి దూరంగా ఉండండి. 


Also Read: కఫాన్ని మింగేస్తే ఏం జరుగుతుంది? శ్లేష్మం ఎందుకు ఏర్పడుతుంది?