యుధ సంపత్తి, సైనిక బలం కలిగిన రష్యాను ఎదుర్కోవడమంటే మాటలు కాదు. కానీ, ఉక్రేయిన్.. తన శక్తి మేరకు పోరాడుతూనే ఉంది. తమ దేశాన్ని కాపాడేందుకు సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రష్యా చేతులకు దేశం చిక్కకూడదని లక్ష్యంతో అందుబాటులో ఉన్న ఆయుధాలతో శత్రుదేశ సైనికులను ఎదుర్కొంటున్నారు. తమ ప్రజలను, తమ నేలను, తమ సంస్కృతిని కాపాడుకొనేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. వీరు అంత ధైర్యంగా పోరాడేందుకు కారణం.. ఒకే ఒక్కడు. అతడే వోలోదిమిర్ జెలెన్‌స్కీ, ఉక్రేయిన్ అధ్యక్షుడు. 


దేశం కష్టాల్లో ఉంటే ‘‘మీ ఖర్మ.. మీ చావు మీరు చావండి’’ అని అక్కడి నుంచి పారిపోలేదు. పొరుగుదేశాలు ఆయనకు ఆశ్రయం ఇస్తామని చెబుతున్నా.. ‘‘ఇది నాదేశం, నా నేల. చావయినా, బతుకైనా ఇక్కడే’’ అంటూ రొమ్ము విరిచి నిలబడ్డారు. ఆయన ధైర్యమే ఇప్పుడు ఉక్రేయిన్ సైన్యాన్ని ముందుకు నడిపిస్తోంది. ఆయన మాటలు.. శత్రువుల తూటాలను ఎదిరించే మనోబలాన్ని ఇస్తున్నాయి. అధ్యక్షుడి స్థాయిలో ఉన్న ఆయన తన బంగ్లాలో కూర్చొని అధికారులు ఇచ్చే అప్‌డేట్స్ తెలుసుకుంటే చాలు. కానీ, ఆయన అలా చేయలేదు. శత్రుదేశం కోరుకుంటున్నది ఆయన ప్రాణాలేనని తెలిసినా.. సైనిక దుస్తుల్లో జవాన్‌లా మారారు. సైన్యంలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు. యావత్ ప్రపంచం ఆయన్ని చూసి సలాం చేస్తుంది. అందరి మనసుకు దగ్గరైన ఈ నాయకుడిని రష్యా ఏం చేస్తుందనే కలవరం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. ఒకప్పుడు ప్రజలను కడుపుబ్బా నవ్వించిన ఆ కమెడియన్.. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. అయితే, నవ్వించడానికి కాదు.. ప్రజల కన్నీరు తుడిచేందుకు. 


వొలొదిమిర్ జెలెన్‌స్కీ, 1978, జనవరి 25న జన్మించారు. 2000 సంవత్సరంలో కీవ్ నేషనల్ ఎకనామిక్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన 17 ఏళ్ల వయస్సులోనే KVN అనే కమెడీ కాంపిటీషన్‌లో పాల్గొన్నారు. అందులో విజేతగా నిలిచారు. ఆ తర్వాత కమెడియన్‌గా ఆయన కొన్ని షోలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రష్యాలోని మస్కోలో కూడా పలు షోలు చేశారు. అక్కడి ప్రజలకు కూడా జెలెన్‌స్కీ అంటే చాలా ఇష్టం. 2003 నుంచి ఆయన టీవీ షోలకు ప్రోడ్యూసర్‌గా పనిచేశారు. 2009 నుంచి ఆయన నటనలో ఓనమాలు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ‘లవ్ ఇన్ ది బిగ్ సిటీ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎనిమిది చిత్రాల్లో నటించారు. 


Also Read: రణరంగంలో రొమాన్స్, ఉక్రెయిన్ మహిళలకు రష్యా జవాన్లు వింత రిక్వెస్టులు, ఇదిగో ఇలా..


జెలెన్‌స్కీకి చెందిన టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ Kvartal 95 సభ్యులంతా కలిసి 2018లో ‘సర్వంట్ ఆఫ్ ది పీపుల్’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆ పేరుతోనే సీరిస్‌ కూడా నిర్వహించారు. నాయకులపై ప్రజల్లో నమ్మకం కలిగించడం, రాజకీయాలను హూందాగా మార్చే లక్ష్యంతో జెలెన్‌స్కీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. జెలెన్‌స్కీ సిద్ధాంతాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. 2019 అధ్యక్షుడి ఎన్నికల్లో బరిలోకి నిలిచిన జెలెన్‌స్కీ గట్టి పోటీయే ఇచ్చారు. ఎట్టకేలకు 42 ఏళ్ల వయస్సులోనే జెలెన్‌స్కీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఉక్రేయిన్‌కు మంచి నాయకుడు దొరికాడని ప్రజలు మురిసిపోతున్న తరుణంలో.. యుద్ధం రూపంలో పిడుగుపడింది. ఉక్రేయిన్ అస్తవ్యస్తమైంది. రష్యా బలగాలు ఇప్పటికే రాజధానిలోకి ప్రవేశించాయి. జెలెన్‌స్కీ కోసం అన్వేషిస్తున్నాయి. ఆయన వారికి చిక్కినా, మరణించినా యుద్ధం ముగుస్తుంది. కానీ, అది చరిత్రలో చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది.