వేసవి వేడి అనేక ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. అసిడిటీ, పొత్తి కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలకు వేసవి అనువైన సమయం. శరీరంలో నీటి కొరత, వేడి వాతావరణం, ఆహారంలో ఫైబర్ లేకపోవడం, జంక్ ఫుడ్ తినడం, తిన్న వెంటనే నిద్రపోవడం వంటి కారణాల వల్ల అజీర్ణం సమస్య ఎదురవుతుంది. దీని నుంచి బయట పడాలంటే ఈ ఆరోగ్యకరమైన ఆహారాలని మీ డైట్ లో చేర్చుకుంటే అజీర్ణం సమస్య గంటలో తగ్గిపోతుంది.


క్వినోవా: బరువు తగ్గించే వాటిలో క్వినోవా బెస్ట్. దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టైప్ 2 డయాబెటిస్ ని నియంత్రిస్తుంది. అంతే కాదు వేసవిలో సాధారణంగా కనిపించే అజీర్ణ సమస్యని తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


ఆకుకూరలు: బచ్చలికూర, పాలకూర, క్యాబేజ్, బ్రొకోలి, కాలీఫ్లవర్ వంటి వాటిలో నీటి కంటెంట్ ఉంటుంది. ఫైబర్ అధికంగా లభించే ఆహారాలు. ఇవి జీర్ణక్రియను సాఫీగా చేస్తాయి. వేసవిలో శరీరం డీహైడ్రేట్ బారిన పడకుండా ఇవి కాపాడతాయి. శరీరానికి కావలసిన నీటిని అందిస్తాయి.


దోసకాయ: నీటి కంటెంట్ ఎక్కువ. ఇవి తీసుకుంటే రీఫ్రెష్ గా అనిపిస్తుంది. ఫైబర్ తో నిండిన ఆహారం కావడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచుతాయి. సలాడ్, స్మూతీస్ లేదా జ్యూస్ రూపంలో తాగడానికి జోడించుకోవచ్చు.


పుచ్చకాయ: వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పండ్ల జాబితాలో పుచ్చకాయ ఉంటుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని బాగా హైడ్రేట్ గా ఉంచుతుంది. జీర్ణక్రియను సులభతరం చేయడానికి ఆరోగ్యంగా ఉండటానికి హైడ్రేషన్ కీలకం.


పెరుగు: పెరుగులో ప్రొ బయోటిక్స్ ఉంటాయి. గట్ ఆరోగ్యాన్ని రక్షించే మంచి బ్యాక్టీరియా పెరుగు ద్వారా లభిస్తుంది. సమ్మర్ డైట్ లో పెరుగు బాగా ఉపయోగపడుతుంది. కానీ పెరుగు రాత్రి పూట తినడం కంటే మధ్యాహ్నం లేదా ఉదయం తీసుకోవడం మంచిది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం రాత్రి వేళ పెరుగు తింటే అరుగుదల సమస్యలు వస్తాయి. జీర్ణం కావడం కష్టమవుతుంది.


టొమాటోలు: టొమాటోలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అనేక రకాలుగా వీటిని తీసుకోవచ్చు. పప్పు, సబ్జీ, సలాడ్, సూప్ లో చేర్చుకోవచ్చు. లేదంటే టొమాటో జ్యూస్ తాగడం వల్ల అజీర్ణ సమస్య వల్ల వచ్చే అసౌకర్యాన్ని అధిగమించవచ్చు.


కొబ్బరినీరు: వేసవిలో ఆరోగ్యకరమైన పానీయాలలో కొబ్బరి నీళ్ళు ఒకటి. అజీర్ణ సమస్యను తగ్గిస్తుంది. చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి నింపుతుంది. తక్షణ శక్తిని ఇస్తుంది.


మజ్జిగ: వేసవిలో తప్పనిసరిగా మజ్జిగ తీసుకోవాలి. జీర్ణశక్తిని పెంచుతుంది. వేసవి నెలలో ఫిట్ గా, చక్కగా ఉండేందుకు సహాయపడుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ట్యాప్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటున్నారా? సహజమైన మెరుపు మీరు పోగొట్టుకుంటున్నట్టే