ఒక్కోసారి రాత్రి వండిన అన్నం మిగిలిపోతుంది. ఇంట్లో వాళ్లు బయటకు వెళ్లడమో ఆకలిలేకపోవడం అనే కారణాలతో వండిన అన్నం మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం కష్టపడేదే తిండి గురించి. కాబట్టి చూస్తూ చూస్తూ అన్నాన్ని పడేయాలనిపించదు. అయితే కొందరు రాత్రి మిగిలిన అన్నాన్ని తినేందుకు ఇష్టపడరు. దానితో చిత్రాన్నం లాంటివి చేస్తే ఒక్కోసారి తింటారు. ఒక్కోసారి అది కూడా తినరు.
ముఖ్యంగా పిల్లలు ఉదయాన్నే ఏదైనా టేస్టీగా తినాలనుకుంటారు. అప్పుడు అన్నం పెడితే పూర్తిగా మారం చేస్తారు. పెద్దవాళ్లు కూడా ఉదయాన్నే అన్నం తినడమేంటి అంటూ ఉంటారు. అందుకే తెలివిగా మీరు మిగిలిపోయిన అన్నంతో ఉదయాన్నే ఈ రెసిపీ ట్రై చేయండి. ఇది అన్నం తిన్నామనే ఫీల్ రానివ్వదు. పైగా పిల్లలు కూడా దీనిని ఇష్టంగా తినేస్తారు. అదే రైస్ పాన్ కేక్. దీనిని తయారు చేయడం చాలా తేలిక. ఈ టేస్టీ టేస్టీ హెల్తీ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో? ఎలా దీనిని తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మిగిలిపోయిన అన్నం - 1 కప్పు
గోధుమ పిండి - 1 కప్పు
చక్కెర - 1 టేబుల్ స్పూన్
బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్
బేకింగ్ సోడా - 1/2 టీస్పూన్
ఉప్పు - కొద్దిగా
పాలు - 1 కప్పు
గుడ్డు - 1
బటర్ లేదా నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెనిలా ఎసెన్స్ - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
ఒక పెద్ద మిక్సింగ్ గిన్నె తీసుకోండి. దానిలో పిండి, పంచదార, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు దానిలో పాలు, గుడ్డు, వెన్నను కరిగించి వేసి బాగా కలపండి. వెనిలా ఎసెన్స్ వేయాలనుకుంటే వేయొచ్చు. మీకు అందుబాటులో ఇది లేకున్నా పర్లేదు. ముందు వేసిన పదార్థాలు అన్ని బాగా కలిపి.. దానిలో అన్నాన్ని వేసి బాగా మిక్స్ చేసి మిశ్రమాన్ని 5 నిమిషాలు పక్కన పెట్టేయండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టండి. మంటను మీడియంలో ఉంచి.. దానికి నూనె లేదా బటర్ అప్లై చేయండి. ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని గరిటతో తీసుకుని దోశలాగా వేయండి. పలుచగా కాకుండా దిబ్బరొట్టె మాదిరిగా వేసుకోవాలి. అది ఒక వైపు వేగిన తర్వాత మరోవైపు తిప్పి బంగారు గోధుమ రంగులోకి వచ్చేవరకు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి పాన్ కేక్స్ రెడీ. రుచిలో కూడా మీ మనసు గెలుచుకుంటాయి. వీటిని సిరప్స్, పండ్లు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
Also Read : పెరుగన్నాన్ని ఇలా తయారు చేసి.. ఉదయాన్నే తింటే ఎన్ని ప్రయోజనాలో..
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.