నాన్‌వెజ్ ప్రియులకు మటన్ కీమా అంటే ఇష్టం ఎక్కువగానే ఉంటుంది. వారానికి ఒకసారి అయినా కచ్చితంగా తినేవారు ఎంతోమంది ఉన్నారు. మటన్ కీమాతో వేపుడు చేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు, అలాగే బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకేలా చేసుకుని తింటే బోర్ కొట్టేస్తుంది. ఈసారి పొట్లకాయతో కలిపి వండి చూడండి. కూర ఎక్కువగా అవడమే కాదు రుచి కూడా కొత్తగా ఉంటుంది. ఒకేసారి రెండు పూటలకు సరిపడా వండేసుకోవచ్చు కూడా.


కావాల్సిన పదార్థాలు
మటన్ కీమా - అరకిలో 
పొట్లకాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు 
పసుపు - ఒక స్పూను 
నూనె - సరిపడా 
కారంపొడి - రెండు స్పూన్లు 
ధనియాల పొడి - ఒక స్పూను 
గరం మసాలా - ఒక స్పూను
ఉల్లిపాయలు - రెండు 
పచ్చిమిర్చి - రెండు 
కరివేపాకులు - గుప్పెడు 
జీలకర్ర పొడి - అర స్పూను 
ఉప్పు - రుచికి సరిపడా 


తయారీ ఇలా
పొట్లకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు కుక్కర్ స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. అందులో కాస్త నూనె వేసి మటన్ కీమా కూడా వేసి వేయించాలి. అది కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు,కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి బాగా కలపాలి. ఒక ఐదు నిమిషాలు పాటు మూత పెట్టి మగ్గించాలి. తర్వాత నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేయాలి. దాదాపు 5 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఇప్పుడు కళాయి స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. వాటి రంగు బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పసుపు, ఉప్పు, కారం కూడా వేసి బాగా వేయించాలి. ఇందులో పొట్లకాయ ముక్కలను వేసి బాగా కలిపి మగ్గించాలి. ఒక పావు గంటసేపు మగ్గించాలి. తరువాత ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న మటన్ కీమా మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. మూత పెట్టి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. దించడానికి ఐదు నిమిషాలు ముందు కరివేపాకులను, కొత్తిమీరను కూడా చల్లుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి. అంతే మటన్ కీమా, పొట్లకాయ కూర రెడీ అయినట్టే. ఈ కూరను వేడివేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. చపాతి పూరీల్లోకి కూడా ఈ కూర బావుంటుంది.


పొట్లకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పొట్లకాయను తినడం వల్ల మధుమేహం, అధికరక్తపోటు అదుపులో ఉంటాయి. మూత్రా పిండాల వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతాయి. తరచూ పొట్లకాయ తినడం చాలా అవసరం. దీనలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, అయోడిన్ అధికంగా ఉంటాయి. 


Also read: 2050 నాటికల్లా 100 కోట్ల మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశం జాగ్రత్త








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.