Homemade Diwali Sweets Recipes : దీపావళి (Diwali 2024) సమయంలో స్వీట్స్​ని ఎక్కువగా చేసుకుంటారు. ఒకరికొకరు ఇచ్చుకోవడంతో పాటు.. ఇంట్లో వారి కోసం ట్రెడీషనల్ స్వీట్స్ చేస్తారు. అయితే కొన్ని ఫేమస్​ స్వీట్స్​ని ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్టీ స్వీట్స్​ని పండుగ సమయంలో తక్కువ సమయంలో ఎలా చేసుకోవచ్చో.. సింపుల్ రెసిపీలు, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


బాదం హల్వా 


ముందుగా బాదం పప్పులను నాలుగు నుంచి ఐదు గంటలు నానబెట్టుకోవాలి. వాటిపై ఉన్న తొక్కను తీసి.. మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. పాన్ పెట్టాలి. దానిలో పాలు వేసి.. అవి కాస్త వేడి అయిన తర్వాత దానిలో బాదం పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ చిక్కగా మారేవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దానిలో పంచదార వేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత యాలకుల పొడి వేసుకుని.. చివర్లో కుంకుమ పువ్వు వేసుకుని కలపాలి. నెయ్యి వేసి.. అది పూర్తిగా హల్వాలో మిక్స్​ అయ్యేవరకు ఉంచుకోవాలి. ఇది చిక్కగా మారిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. బాదం పలుకులు వేస్తే బాదం హల్వా రెడీ. 


గులాబ్ జామున్


గులాబ్ జామున్​ని పండుగల సమయంలోనే కాకుండా రెగ్యూలర్​గా కూడా చేసుకోవచ్చు. దీపావళి సమయంలో ఇవి కూడా కచ్చితంగా ఉంటాయి. అయితే వీటిని తయారు చేయడం చాలా సింపుల్. గులాబ్ జామున్​ పౌడర్ తీసుకుని.. దానిలో చిటికెడు ఉప్పు వేసి పాలతో కలుపుకోవాలి. దీనిని నీటితో కూడా చేసుకోవచ్చు. కానీ పాలతో కలిపితే మంచి రుచి వస్తుంది. పిండిని ముద్దగా చేసుకోవాలి. ఇలా చేసిన


పిండిని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అనంతరం చిన్న చిన్న బాల్స్​గా చేసుకోవాలి. 
డీప్​ ఫ్రై కోసం నూనెని వేడి చేసుకోవాలి. మరో స్టౌవ్​పై షుగర్​ సిరప్​ని సిద్ధం చేసుకోవాలి. దానిలో యాలకుల పొడి వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత.. ముందుగా చేసుకున్న బాల్స్ వేసుకోవాలి. అవి కలర్ మారి ముదురు గోధుమరంగులోకి వచ్చిన తర్వాత షుగర్ సిరప్​లో వేసుకోవాలి. వాటిని ఓ గంటపాటు పక్కన పెట్టేస్తే.. సిరప్​ గులాబ్ జామున్స్​ లోపలికి బాగా వెళ్తుంది. అంతే టేస్టీ గులాబ్​ జామున్స్​ రెడీ. 



కొబ్బరి లడ్డూలు


దాదాపు ప్రతి పండుగ సమయంలో కొబ్బరి లడ్డూలు చేసుకోవచ్చు. దీపావళికి కూడా వీటిని ఎక్కువమంది చేసుకుంటారు. ముందుగా స్టౌవ్ వెలిగించి పాన్​ పెట్టాలి. దానిలో నెయ్యి వేసి.. తురిమిన కొబ్బరి వేసుకోవాలి. ఇది కాస్త రంగు మారి.. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దానిలో కాచిన పాలు, పంచదార వేసి కలపాలి. యాలకుల పొడి వేసుకుని.. మిశ్రమం చిక్కబడేవరకు  ఉడికించుకోవాలి. పాలు కొబ్బరిలో కలిసి చిక్కబడుతుంది. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. వీటిని డ్రై ఫ్రూట్స్ తురుముతో గార్నీష్ చేసుకోవచ్చు.  



మైసూర్ పాక్​


మైసూర్​ పాక్​ని ఒక్కోక్కరు ఒక్కోలా చేస్తారు. దానిలో ఇది కూడా ఓ మంచి రెసిపీనే. అదేంటంటే ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో నెయ్యి వేయాలి. అది వేడి  అయిన తర్వాత శనగపిండి వేసి.. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండిలోని పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు దానిలో పంచదార, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ.. పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత పిండి స్మూత్​గా, క్రీమీగా మారుతుంది. అప్పుడు స్టౌవ్ ఆపేసి.. నెయ్యిని రాసిన ప్లేట్​లో ఈ పిండిని వేసి.. పరచుకోవాలి. నచ్చిన షేప్​లలో కట్ చేసుకోవాలి. అంతే టేస్టీ మైసూర్ పాక్ రెడీ.



ఇవే కాకుండా ఎన్నో స్వీట్స్, వివిధ రకాల హాట్, క్రిస్పీ వంటకాలు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే మీ రెసిపీలతో పాటు.. ఈ సింపుల్ స్వీట్స్​ను కూడా చేసేయండి. 


Also Read : దీపావళి సమయంలో లేడీస్​కి ఈ డ్రెస్​లు బెస్ట్.. మగవారు ఈ ట్రెండ్స్ ట్రై చేయొచ్చు