Homemade Detox Drinks for Health : శరీరాన్ని డీటాక్స్ చేసి.. లోపల పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపించడం చాలా ముఖ్యం. ఎందుకంటే నిర్వీషీకరణ చేయకుంటే వ్యర్థాలు లోపల పేరుకుపోయి ఆరోగ్యానికి హాని చేస్తాయి. అంతేకాకుండా ఎక్కువ టాక్సిన్లు బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా మారి.. అవయవాలపై ప్రభావం చూపిస్తాయి. జీర్ణ సమస్యలను పెంచుతాయి. కాబట్టి పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపడం చాలా ముఖ్యం. ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల టాక్సిన్లు బయటకుపోవడమే కాకుండా.. జీర్ణక్రియ మెరుగవుతుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి.
మీరు కూడా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే కొన్ని డీటాక్స్ డ్రింక్‌లు ట్రై చేయవచ్చు. పోషకాలతో నిండిన నిర్విషీకరణ పానీయాల తాగడం వల్ల వ్యర్థాలు బయటకు పోయి.. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మరి మీ సిస్టమ్‌ను సహజంగా శుభ్రపరిచే, దీర్ఘకాలిక ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే డ్రింక్ ఏంటో.. వాటి ప్రభావాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
నిమ్మకాయ, అల్లంతో
అల్లం నీటిలో వేసి మరిగించి.. దానిలో నిమ్మకాయ రసం కలిపి తాగితే చాలా మంచిది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే పురాతనమైన డ్రింక్. నిమ్మకాయ పుల్లని, ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను శరీరానికి అందిస్తుంది. అల్లం ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మంటను తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మెటబాలీజం పెరుగుతుంది. కాలేయ పనితీరుకు మద్ధతు ఇస్తుంది. శరీరాన్ని సహజంగా శుభ్రపరిచే ప్రక్రియలను ప్రేరేపిస్తుంది.
ఈ డ్రింక్‌ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం పోషకాలను గ్రహిస్తుంది. తేలికపాటి శక్తిని అందిస్తుంది. ఎక్కువ స్వీట్లు, వేయించిన ఆహారాలు తీసుకునేవారు దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది లోపలి నుంచి శరీరాన్ని బ్యాలెన్స్ చేసి.. టాక్సిన్ ఫ్రీ చేస్తుంది.
పసుపు, తేనెతో..
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. గోరువెచ్చని పసుపు నీటిలో కొద్దిగా తేనె కలిపి తాగితే జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ డీటాక్స్ డ్రింక్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.టాక్సిన్స్ తగ్గించి హెల్తీ స్కిన్ అందిస్తుంది. ఈ డ్రింక్‌లో చిటికెడు నల్ల మిరియాలు కూడా వేసుకోవచ్చు. శరీరాన్ని టాక్సిన్స్ ఫ్రీగా చేసి.. శక్తివంతంగా రీసెట్ చేసుకోవడం కోసం దీనిని తాగవచ్చు.
పుదీనా. కీర దోసకాయతో..
పుదీనా, కీర దోసకాయతో ఇన్ఫ్యూజ్ చేసిన నీరు శరీరాన్ని సహజంగా హైడ్రేట్ చేస్తుంది. టాక్సిన్లను బయటకు పంపి రిఫ్రెష్ చేస్తుంది. కీరదోసకాయ యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చల్లటి నీటిలో కీరదోసకాయ, తాజా పుదీనా ఆకులను వేసి కొన్ని గంటలు ఉంచండి. రాత్రి నానబెట్టి ఉదయం తాగితే మరీ మంచిది. ఇది మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇచ్చి.. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఉదయం లేదా భోజనాలకు మధ్య ఒక గ్లాసు పుదీనా, కీర దోసకాయ నీరు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
గ్రీన్ టీ సహజమైన క్లెన్సర్
గ్రీన్ టీ శరీరంలోని టాక్సిన్లను నిర్విషీకరణ చేసి.. జీవక్రియను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండే గ్రీన్ టీని నిమ్మతో కలిపి తీసుకుంటే దాని శుభ్రపరిచే ప్రభావం పెరుగుతుంది. ఆ సమయంలో ఇది యాంటీఆక్సిడెంట్-రిచ్ పానీయంగా మారి.. ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో, కాలేయ పనితీరుకు మద్దతు ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది.
ఆపిల్, దాల్చిన చెక్కతో
ఆపిల్, దాల్చిన చెక్క కలిపి జీర్ణక్రియకు సహాయపడి, ఉబ్బరాన్ని తగ్గించి, రక్తంలో చక్కెరను సమతుల్యం చేస్తాయి. తాజా ఆపిల్‌ను ముక్కలు చేసి.. వాటిని నీటిలో వేసి.. దాల్చిన చెక్క వేసి ఉడికించాలి. ఈ పానీయంలో పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయ నిర్విషీకరణకు మద్దతు ఇస్తాయి. ఆరోగ్యకరమైన పేగులను ప్రోత్సహిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి సహాయపడుతుంది.
ఇవేకాకుండా కలబంద గుజ్జు, నిమ్మకాయ రసం కూడా శరీరాన్ని డీటాక్స్ చేసి శక్తినివ్వడంలో మంచి ఫలితాలు ఇస్తుంది. చేదుగా ఉంటుంది అనుకునేవారు.. కొబ్బరి నీళ్లల్లో కాస్త నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఇది ఎలక్ట్రోలైట్స్ పెంచి.. జీర్ణక్రియకు మద్ధతు ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి.. టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. సోంపు, ధనియాలు నీటిలో వేసి మరిగించి కూడా తాగవచ్చు. ఇది కాలేయ పనితీరు మెరుగుపరిచి.. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. టాక్సిన్లు బయటకు పంపి.. ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది.