చిన్నప్పుడు పిల్లలకు మనం ఏం నేర్పితే పెద్దయ్యాక వారు అదే అనుసరిస్తారు. వారికి చిన్పప్పట్నించే కుటుంబసభ్యులతో ప్రేమగా, బాధ్యతగా ఉండడం నేర్పాలి. నోటితో చెప్పడం వల్ల వారికి రాదు, మనం చేసి చూపించాలి. దీనివల్ల పిల్లలతో మీ బంధం కూడా బలపడుతుంది. అంతేకాదు మీరు మరింత ప్రేమగా ఉండడం వల్ల భవిష్యత్తులో మానసికంగా స్థిరంగా ఉంటారు పిల్లలు. వారిలో కూడా తల్లిదండ్రులపై కచ్చితంగా అనురాగం పెరుగుతుంది. మీ పిల్లలతో చక్కగా కనెక్ట్ అయ్యేందుకు రోజూ చేయాల్సిన కొన్ని పనులు ఇవిగో...


వెచ్చని కౌగిలింత
పిల్లలు ఉదయం లేవగానే తల్లిదండ్రుల దగ్గరకే వస్తారు. అప్పుడు ఓ వెచ్చని కౌగిలింతతో వారికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. మీ పిల్లలు పసివాళ్లు అయిన పెద్దవాళ్లు అయినా మీకు బిడ్డలే కదా... అందుకే ఉదయానే కౌగిలించుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరిగిపోతుంది. ఒక హగ్‌తో మీరు వారి కోసం ఉన్నారనే భావన వారిలో పెంచవచ్చు. చాలా మంది పిల్లల్లో భయాన్ని పోగొట్టి మీరున్నారనే ధైర్యాన్ని ఇస్తుంది. 


కలిసి ఆడండి
పిల్లలు ఎంత పెద్దవాళ్లు అయినా కూడా మీ కంటి పాపలే. వారితో కనీసం వారానికి  ఓసారైనా ఏదైనా ఆట ఆడడం అలవాటు చేసుకోండి. ఇండోర్ అయినా అవుడ్ డోర్ అయినా ఏ గేమ్ అయినా కలిసి ఆడడం వల్ల మీ మధ్య బంధం పెరుగుతుంది. చిన్న పిల్లలతో అయితే లెగోస్,డాల్ హౌస్ వంటి ఆటలు ఆడొచ్చు. అదే పెద్ద వాళ్లయితే చెస్, లూడో, క్యారెమ్స్ వంటివి ఆడొచ్చు. అప్పుడు వారి ఆనందాన్ని చూడండి. 


ఇంటి పనుల్లో
పిల్లలకు పని చెప్పకూడదని లేదు, వారి వయసుకు తగ్గట్టు చిన్న చిన్న పనులు చెప్పవచ్చు. మీరు ఇంటి పని చేస్తున్నప్పుడు వారిని కూడా భాగస్వామ్యం చేసుకోండి. ఆ గిన్నె తీసుకురా, మొక్కలకు నీళ్లు పోయు, కింద పడేసిన బొమ్మలు తీసి పెట్టు.... ఇలాంటి పనులు చెప్పవచ్చు.  ఇది వారిలో జట్టుగా చేసే స్పూర్తిని పెంచుతుంది. దీన్నే టీమ్ స్పిరట్ అంటారు. అలాగే మీతో పాటూ చేయడం వల్ల భవిష్యత్తులో కూడా వారు ఇంట్లో వారికి సాయం చేసే విధంగా పెరుగుతారు. 


కలిసి తినండి
స్కూళ్లు, ఆఫీసుల వల్ల కలిసి తినడం కుదరదు. కానీ రాత్రిపూట అయినా కలిసి తినేందుకు ప్రయత్నించండి. పంచుకుని తినడం వల్ల కూడా ప్రేమ, కేరింగ్ పెరుగుతుంది. తల్లీ బిడ్డల బంధం బలపడుతుంది. తినేటప్పుడు వారి పట్ల తీసుకునే కేర్ వారిలో మరింత ప్రేమను కలిగిస్తుంది. అప్పుడప్పుడు తినిపిస్తే పిల్లలకు ఇంతా అంతా ఆనందం కాదు. 


కచ్చితంగా అడగండి
ఉదయం స్కూలు, సాయంత్రం ట్యూషన్ అయిపోయాక ఇంటికి చేరుతారు పిల్లలు. రాత్రి భోజనం చేసేటప్పుడు ‘ఈరోజు ఏం చేశావ్? ఎలా సాగింది?’ అని కచ్చితంగా అడగండి. వారి మనసులోని మాటలు వినండి. వారు మీతో అన్ని విషయాలు చెప్పుకునే స్వేచ్ఛను ఇవ్వండి. అలా అన్ని విషయాలు షేర్ చేసుకున్నప్పుడు వారు మీకు మరింత దగ్గరవుతారు. 


Also read: మానసిక ఆందోళనను తగ్గించే ఉత్తమ ఆయుర్వేద ఔషధాలు ఇవిగో