చాలా మంది మహిళల్లో తుంటి భాగంలో ఫ్రాక్చర్లు అవుతుంటాయి. అయితే తుంటి ఫ్రాక్చర్లు శాకాహారం తినే మహిళల్లోనే అధికమని చెబుతోంది కొత్త అధ్యయనం. మాంసాహారం తినేవారితో పోలిస్తే శాకాహార స్త్రీలలో తుంటి ఫ్రాక్చర్లు వచ్చే అవకాశం 33 శాతం ఎక్కువని చెబుతున్నారు అధ్యయనకర్తలు.దాదాపు 26,000 మందిపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. యూకేలోని లీడ్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయానాన్ని నిర్వహించారు. ఇందులో మాంసం తినేవారిపై, అలాగే చేపలను మాత్రమే తినేవారిపై, పూర్తి శాకాహారులపై పరిశోధన నిర్వహించారు.
అధ్యయనం సాగింది ఇలా...
ఈ పరిశోధన కోసం దాదాపు 20 ఏళ్ల వ్యవధిని తీసుకున్నారు. 20 ఏళ్ల పాటూ వారిని గమనించారు. 26,000 మందిలో 822 మందికి హిప్ ఫ్రాక్ఛర్లు అయ్యాయి. వారి ఆహారపు అలవాట్లను తెలుసుకున్నారు. వయసు, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నాయేమో నమోదు చేసుకున్నారు. అయితే ఆ 822 మందిలో హిప్ ఫ్రాక్చర్ అయింది అధికంగా శాకాహారులే. అన్ని రకాల మాంసాలు తినేవారిలో, చేపలను మాత్రమే తినేవారిలో కూడా హిప్ ఫ్రాక్చర్లు తక్కువగా నమోదయ్యాయి. కానీ శాఖాహారుల్లో మాత్రం తుంటి పగుళ్లు అధికంగా నమోదయ్యాయి.
శాకాహారం మానేయమని కాదు...
తమ అధ్యయనాన్ని ఆధారంగా చేసుకుని శాకాహారులందరినీ మాంసాహారులుగా మారమని తాము సిఫారసు చేయడం లేదని అధ్యయనకర్త జేమ్స్ వెబ్ స్టర్ అన్నారు. శాకాహారంలో ఆరోగ్యకరమైన, అనారోగ్యకరమైన ఆహారాలు ఉంటాయని, వాటిలో అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పారు. కాబట్టి శాకాహారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. శాకాహార మహిళలు సమతుల్య ఆహారాన్ని సరిగా తీసుకోకపోవడం వల్లే వారిలో హిప్ ఫ్రాక్చర్లు అధికం అవుతున్నట్టు చెబుతున్నారు పరిశోధకులు. ప్రొటీన్, కాల్షియం లాంటివి సాధారణంగానే శాకాహారంతో పోలిస్తే మాంసాహారంలో అధికంగా ఉంటాయి. కాబట్టి మాంసాహారుల్లో ఇలా తుంటి పగుళ్లు ఎక్కువగా కలగవు.
కాబట్టి శాకాహారులు సమతులాహారంతో పాటూ ప్రొటీన్లు, కాల్షియం ఉండే ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి.
Also read: కొత్తగా పెళ్లయిన జంటల కోసమే ఈ కిళ్లీ, మొదటి రాత్రికే ప్రత్యేకం
Also read: ఎయిర్ ఫ్రైయర్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు ముందుగా తెలుసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.Al