శరీరంలోని 20 శాతం కేలరీలను మెదడు ఉపయోగిస్తుంది. మనం రోజంతా ఏకాగ్రతగా ఉండటానికి దీనికి ఇంధనం అవసరం. నిద్రలో ఉన్నప్పుడు మెదడు మినహా అన్ని శరీర అవయవాలు స్తబ్దుగా ఉంటాయి. మెదడు మాత్రం నిరంతరం చురుకుగా ఉంటుంది. అందుకే మెదడుని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మంచి ఆహారం తీసుకోవాలి.
నిరంతరం పని చేయడం, ఒత్తిడి వంటివి మానసిక అలసటకి దారితీస్తాయి. దాన్ని తగ్గించుకోవడం కోసం విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, ధ్యానం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇవే కాదు మీ మెదడుని ఆరోగ్యంగా ఉంచాలంటే విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారం ఇవ్వడం కూడా ముఖ్యమే.
సాధారణ జీవితంలో కొంతమంది చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. వయసు రీత్యా మెమరీ లాస్ రావడమే కాదు ఇప్పుడు సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల జ్ఞాపకశక్తి కుంటుపడుతుంది. దాన్ని మెరుగుపరచాలంటే మెదడుని ఉత్తేజపరిచే ఆహారాలు ఎంచుకోవాలి. కొన్ని విటమిన్లు మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తి కోల్పోకుండా కాపాడతాయి. అందుకే మెదడు సరిగా పని చేయాలంటే మీ ఆహారంలో ఈ విటమిన్లు చేర్చుకోవాలి. అప్పుడే జ్ఞాపకశక్తికి ఎటువంటి ఢోకా ఉండదు.
విటమిన్ సి: సిట్రస్ పండ్లలో సమృద్ధిగా ఉంటుంది. వీటిలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, ఎముకలను బలోపేతం చేయడం మాత్రమే కాదు మెదడు పనితీరు కూడా బాగుండెలా చూస్తుంది. అందుకే పార్స్లీ , మొలకలు, సిట్రస్ పండ్లు, స్ట్రాబెర్రీలు, బ్రొకోలి, బంగాళాదుంపలు, కివీ, రెడ్ పెప్పర్, క్యాబేజీ ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి.
విటమిన్ ఇ: చర్మం, జుట్టు కోసం విటమిన్ ఇ అవసరమే. దీనితో పాటు జ్ఞాపకశక్తి నష్టాన్ని నివారించేందుకు ఈ విటమిన్ కావాలి. పొద్దు తిరుగుడు గింజలు, గోధుమలు, బాదం, గుమ్మడికాయ, బచ్చలికూర, క్యాప్సికమ్, పాలకూర వంటివి వాటిలో ఈ విటమిన్ పుష్కలంగా దొరుకుంటుంది.
మెగ్నీషియం: యాపిల్స్, సెలెరీ, చెర్రీస్, అంజీరా, బొప్పాయి, బఠానీలు, రేగు పండ్లు, బంగాళాదుంపలు, ఆకుకూరలు, వాల్నట్స్ లో మెగ్నీషియం లభిస్తుంది. ఇది మెదడుని ధృడంగా ఉంచేందుకు సహకరిస్తుంది.
విటమిన్ బి12: పాలు, చికెన్, గుడ్లు, చేపలు మొదలైన వాటిలో లభించే బ్రెయిన్ ఫుడ్ ఇది. శాఖాహారులకి విటమిన్ బి12 సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలి. అందుకే శాఖాహారులు త్వరగా విటమిన్ బి12 లోపం బారిన పడతారు.
లెసిథిన్: సహజ వనరులైన గుడ్డు సొనలు, బాదం గింజలు, సిసెమ్ గింజలు, సోయా బీన్స్, గోధుమల్లో ఇది సమృద్ధిగా దొరుకుంటుంది.
ఫాస్ఫాటిడైల్సెరిన్: ఇది సప్లిమెంట్ రూపంలో లభిస్తుంది. సోయాబీన్స్‌లో కూడా ఉంటుంది. సోయా పాలు, టోఫు తీసుకోవడం ద్వారా దీన్ని పొందవచ్చు.
విటమిన్ బి: మెదడుకి శక్తి కావాలంటే విటమిన్ బి6 తో పాటు బి కాంప్లెక్స్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. విటమిన్ బి6 ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసే మెలటోనిన్ విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. దాన్ని పొందాలంటే అరటి పండ్లు, వేరుశెనగలు, ఓట్స్, చికెన్, చేపలు వంటి ఆహారాలు తీసుకోవాలి.
ఫ్లేవనాయిడ్స్: ఉల్లిపాయలు, క్యాబేజ్, బ్రొకోలి, క్యాలీప్లవర్, టర్నిప్, నారింజ రంగు పండ్లు, మిరియాలు, బీన్స్ వంటి వాటిలో ఇవి సమృద్ధిగా దొరుకుతుంది.
కెరొటీనాయిడ్స్: క్యారెట్, మొలకలు, చిలగడదుంపలు, బచ్చలికూర, సెలెరీ, ఎరుపు క్యాప్సికమ్, టోమోటాలు, నారింజల్లో కెరొటీనాయిడ్లు ఉంటాయి. ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచి మీ జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?