కొన్ని ఆహారాలు చర్మానికి హాని చేస్తాయి. మొటిమలు, రొసెసియా, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కలిగిస్తాయి. అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. సెబమ్ ఉత్పత్తిని పెంచి మొటిమలకు కారణమవుతుంది. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే పాల ఉత్పత్తులు తీసుకోవడం కూడా మొటిమలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ఇంకొంత మందికి ఆహారపు అలర్జీలు ఉంటాయి. వాటిని తిన్నప్పుడు చర్మం మీద దద్దుర్లు, ఎర్రగా మారిపోవడం జరుగుతుంది. గింజలు, షెల్ఫిష్, గుడ్లు వంటి ఆహారాలు చర్మ సమస్యలను కలిగించే సాధారణ అలర్జీ కారకాలు. అయితే అన్ని చర్మ సమస్యలు ఆహారంతో సంబంధం కలిగి ఉండవు.


జన్యుశాస్త్రం, హార్మోన్లు, ఒత్తిడి, చర్మం సంరక్షణ విధానాలు ఇతర అంశాలు కూడా చర్మ ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఏదైనా చర్మ సమస్యలకు అంతర్లీన కారణాలను గుర్తించడానికి ఎప్పుడూ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే చర్మానికి హాని చేసే ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండాలి. ఆ పదార్థాల జాబితా ఇక్కడ ఇస్తున్నాం. ఇవి తినడం వల్ల అందరికీ కాకపోయినా కొంతమందికి చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.


షుగర్: సాధారణంగానే చక్కెర ఆరోగ్యానికి ఎంతో హానికరం. దీని వల్ల కలిగే లాభాల జాబితా కంటే వచ్చే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అధిక మోతాదులో చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో మంట ఏర్పడుతుంది. అది మొటిమలు, రొసెసియా వంటి చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.


డైరీ ఉత్పత్తులు: కొన్ని అధ్యయనాల ప్రకారం పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మొటిమలు వచ్చేలా చేసే హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. వీటి వల్ల తరచూ మొటిమల సమస్య ఎదురవుతుంది.


ప్రాసెస్ చేసిన ఆహారాలు: వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అధిక స్థాయిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలో వపూకు దోహదం చేస్తాయి. చర్మ సమస్యలను కలిగిస్తాయి.


ఆల్కహాల్: అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అది మాత్రమే కాదు చర్మం కూడా పాడైపోతుంది. ఆల్కహాల్ వల్ల చర్మం నిర్జలీకర్ణం బారిన పడుతుంది. మంటకు దారితీస్తుంది. చర్మం నిస్తేజంగా, అలిసిపోయినట్టుగా కనిపిస్తుంది.


కెఫీన్: మితమైన కెఫీన్ వినియోగం సురక్షితంగా ఉన్నప్పటికీ అధిక వినియోగం చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇప్పటికే ఉన్న చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.


గ్లూటెన్: కొంతమందికి గ్లూటెన్ సెన్సిటివిటీ ఉంటుంది. ఇది మొటిమలు, దద్దుర్లు వంటి చర్మ సమస్యలకు దోహదపడుతుంది.


స్పైసీ ఫుడ్: స్పైసీ ఫుడ్స్ చర్మం మీద ఎర్ర మచ్చలు కలిగిస్తాయి. ముఖ్యంగా రొసెసియా సమస్య ఉన్నవారిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది.


 ఉప్పు: ఉప్పు లేనిదే ఏ కూరకి రుచి రాదు. కాని దీన్ని అతిగా తీసుకోవడం వల్ల చర్మంలో నీరు నిలుపుకోవడం కష్టమై ఉబ్బిపోతుంది.


కృత్రిమ స్వీటేనర్లు: కొన్ని కృత్రిమ స్వీటేనర్లు మంటను కలిగిస్తాయి.


హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు: వైట్ బ్రెడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటి అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. వాపుకు దారి తీస్తుంది. చర్మ పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: వెల్లుల్లికి బదులు ఈ పదార్థాలు వాడినా చాలు వంట రుచి అదిరిపోతుంది