వర్షాకాలం వచ్చిందంటే భయపట్టే రోగాల్లో డెంగ్యూ ముందుంటుంది. ఈడెస్ జాతి దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ ఇది. వర్షాల వల్ల దోమల సంఖ్య పెరిగి డెంగ్యూ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది డెంగ్యూ ఇన్ఫెక్షన్ ప్రమాదంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం 100-400 మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక వ్యక్తికి డెంగ్యూ సోకినప్పుడు మొదట్లో ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం ప్రాణాంతకం కావచ్చు. ఒక్కోసారి మరణానికి దారి తీస్తుంది. ఇన్ఫెక్షన్ ని నివారించేందుకు దోమల వ్యాప్తిని నియంత్రించడం, తగిన జాగ్రత్త చర్యలు పాటించమే మార్గం.


డెంగ్యూకి నిర్ధిష్టమైన చికిత్స లేదు. అందుకే సకాలంలో గుర్తించడం వల్ల అత్యవసర పరిస్థితి రాకుండా జాగ్రత్త పడొచ్చు. పెద్దల కంటే పిల్లలు త్వరగా డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వారి విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఈ వర్షాకాలంలో మీ పిల్లలు డెంగ్యూ బారిన పడకుండా రక్షించుకునే కొన్ని మార ఇవి.


దోమల నివారణ మందులు వాడాలి


చిన్నారుల చర్మం, దుస్తుల మీద దోమల వికర్షక మందులు పూత రాయాలి. ఇవి దోమల్ని దూరంగా ఉంచడంలో సహాయపడతాయి. నిండైన దుస్తులు వేయాలి. సాయంత్రం ఆరు తర్వాత వారిని బయటకి తీసుకుని వెళ్లకపోవడమే మంచిది.


ఇంటి లోపల శుభ్రంగా ఉంచాలి


ఇండోర్ వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎక్కడ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. పూల కుండీలు, ఇతర నీరు నిల్వ ఉండే ప్రదేశాలని ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.


రోగనిరోధక శక్తి


పిల్లలు సరిగా తినకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. అందుకే వారికి మంచి పోషకాలు ఉండే ఆహారం అందించాలి. అది వారికి రోగాలని ఎదుర్కోవడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. వ్యాధుల నుంచి కాపాడుతుంది. అప్పుడే వాళ్ళు రోగాలతో పోరాడేందుకు బలమైన శక్తిని కలిగి ఉంటారు.


బహిరంగ కార్యకలాపాలు వద్దు


మెరుగైన రక్షణ కోసం బిడ్డ చేతుల వరకు ఉండే దుస్తులు వేయడం ముఖ్యం. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. వీలైనంత వరకు ఇంటి లోపల ఉండే విధంగా చూసుకోవాలి. వర్షాకాలంలో ఆరుబయట ఆడుకునేందుకు అనుమతించవద్దు. దోమలు కుట్టకుండా చూసుకోవాలి.


లక్షణాలు అర్థం చేసుకోవాలి


తల్లి దండ్రులు డెంగ్యూ లక్షణాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మీ పిల్లలు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారో లేదో అర్థం చేసుకోవడం చాలా సులభం. పరిస్థితి మరింత దిగజారక ముందే నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఒక్కోసారి జ్వరం వంటి లక్షణాలు లేకుండానే డెంగ్యూ రావచ్చు. ప్లేట్ లెట్ కౌంట్ తగ్గిపోకుండ చూసుకోవాలి. అది కనుక తగ్గిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: తల్లి పాలలో మరో అద్భుత గుణాన్ని కనుగొన్న పరిశోధకులు - డబ్బాపాలిస్తే పిల్లలు ఇది మిస్సవుతారు!


Join Us on Telegram:https://t.me/abpdesamofficial