కొంతమందికి మద్యం రోజూ ఉండాల్సిందే. ప్రతిరోజూ రాత్రి మద్యం తాగాకే నిద్రపోయే వారి సంఖ్య ఎక్కువ. ఒక్కరోజు ఆ పానీయం లేకపోయినా ఎంతో మంది విలవిలలాడిపోతారు. అలాంటివారు ఒక నెల రోజులు పాటు పూర్తిగా మద్యం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మద్యం తాగడం వల్ల శరీరంపై అప్పటికే ఎంతో ప్రభావం పడి ఉంటుంది. శరీరంలోని ప్రధాన అవయవాలన్నీ మద్యానికి ఎంతో ప్రభావితమై ఉంటాయి. అందుకే నెల రోజులు పాటు మద్యాన్ని మానేస్తే అవయవాల్లో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. 


అతిగా తాగే వారిలో దీర్ఘకాలంలో కాలేయానికి లివర్ సిర్రోసిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకట్రెండు రోజులు తాగితే ఈ సమస్య రాదు. ఎన్నో ఏళ్లపాటు మద్యం తాగే వాళ్ళకి ఈ లివర్ సిర్రోసిస్ వ్యాధి వస్తుంది. ఒక నెలపాటు మద్యం మానేస్తే కాలేయం మళ్లీ ఆరోగ్యంగా మారుతుంది. అది తన పని తాను సవ్యంగా చేయగలుస్తుంది. కాలేయం పరిస్థితులను తట్టుకోగల అవయవం. మద్యం మానేస్తే మళ్లీ  దానిలో సానుకూల మార్పులు వస్తాయి.


ఒక నెలపాటు మద్యం మానేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది. ఎప్పుడైతే మద్యాన్ని మానేశారో, మంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు ఏవి రావు.


యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సర్వీసెస్ వారు చెబుతున్న ప్రకారం ఆల్కహాల్ అనేది కార్సినోజెన్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే క్యాన్సర్ కారకంగా ఇది పనిచేస్తుంది. ఒక వ్యక్తి ఆల్కహాల్ సంబంధిత క్యాన్సర్ ను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువే. ముఖ్యంగా ఆల్కహాల్ అధికంగా తాగడం వల్ల తల, మెడ ప్రాంతంలో క్యాన్సర్ కణితులు పెరిగే అవకాశం ఉంది. అలాగే అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీరు నెల రోజులు పాటు మద్యాన్ని మానేశారో... ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు క్రమేణా తగ్గుతూ ఉంటాయి. పూర్తిగా మానేస్తే చాలా వరకు ఈ క్యాన్సర్ బారిన పడకపోవచ్చు.


ఆల్కహాల్ తాగడం వల్ల క్యాలరీలు ఎక్కువగా శరీరంలో చేరుతాయి. అయితే మద్యాన్ని తాగడం వల్ల ఇతర పోషకాహారాలు తినడం మానేస్తారు. మీరు ఇతర ఆహారాలు తగ్గించడం వల్ల హఠాత్తుగా బరువు తగ్గిపోతారు. సన్నగా ఎండిపోయినట్టు మారిపోతారు. 30 ఏళ్ల వ్యక్తి కూడా 45 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. మద్యాన్ని నెలరోజులు పాటు మానేస్తే మళ్లీ యవ్వనంగా తయారవుతారు.


ఆల్కహాల్ మెదడు పనితీరును కూడా మార్చేస్తుంది. మెదడుకు ఆలోచించే శక్తిని, విచక్షణా జ్ఞానాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మద్యం సేవించేవారు ఏం మాట్లాడుతున్నారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టం. నెల రోజులు మద్యం మానేసి చూడండి... మళ్ళీ మీ ఆలోచన తీరు, మాట తీరు స్పష్టంగా మారుతాయి.



Also read: శిశువుల కంటికి కాటుక పెట్టడం సురక్షితమేనా?























































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.