Miracle Surgery: మెడికల్ మిరాకిల్స్ అంటారు. అలాంటి మెడికల్ మిరాకిల్ ఒకటి చరిత్రలో చోటు చేసుకుంది.  వైద్య శాస్త్రంలో ఇది చరిత్రలో లిఖించదగిన ఘటనగా చెప్పుకోవాలి. దాదాపు మృత్యు ఒడికి చేరుకున్న ఓ పిల్లాడిని రక్షించారు. ఇజ్రాయిల్ వైద్యులు తెగిన తలను తిరిగి అతికించి ఆ పిల్లాడికి పునర్జన్మను ఇచ్చారు. ఇంతవరకు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.


ఇజ్రాయిల్‌లోని జోర్డాన్ వ్యాలీలో నివాసం ఉంటున్నాడు 12 ఏళ్ల సులేమాన్ హసన్. స్కూలు నుంచి ఇంటికి సైకిల్ పై వస్తుండగా కారు ఢీ కొట్టింది. తీవ్ర గాయాలు అయినా పిల్లాడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం తీవ్రంగా జరగడంతో మెడ భాగంలో చాలా గాయాలయ్యాయి. పొత్తికడుపులోను బలమైన దెబ్బలు తాకాయి. తలా, శరీరం ఒకదాని నుంచి ఒకటి వేరైనా స్థితిలో హసన్ ఉన్నాడు. బయట నుంచి తల, శరీరం అతుక్కున్నట్టు కనిపిస్తున్నా... లోపల వెన్నుముకతో తలకు ఉన్న అనుసంధానం దాదాపు తెగిపోయింది. కేవలం చివరి అంచు మాత్రమే కలిపి ఉంది. ఆ స్థితిలో ఎవరైనా మరణానికి చేరువైపోతారు. వైద్యులు అతని పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. వీలైనంతవరకు అతడిని కాపాడాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఆపరేషన్ చేశారు. శస్త్ర చికిత్స ద్వారా తల భాగంలోని లిగ్మెంట్లు, వెన్నెముకతో తిరిగి కలిపారు. ఇది చాలా కష్టమైన ఆపరేషన్. ఆసుపత్రిలో ఉన్న దాదాపు అన్ని విభాగాల్లోని వైద్యులు కూడా కొన్ని గంటల పాటు ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఉన్న సాంకేతికత, వైద్యుల అనుభవం ఆ పిల్లాడిని కాపాడేందుకు ఎంతో ఉపయోగపడింది. ఆపరేషన్ విజయవంతం అయింది.


దాదాపు చావు అంచుల దాకా వెళ్ళిన పిల్లాడిని తిరిగి పునర్జన్మను పోశారు వైద్యులు. దాదాపు నెలపాటు హసన్ ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఈ మధ్యనే డిశ్చార్జి అయి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్లినా కూడా వైద్యులు, నర్సుల పర్యవేక్షణలోనే ఉంటున్నాడు. ఇక బతకడనుకున్న కొడుకు తిరిగి నడిచి ఇంటికి రావడంతో హసన్ తల్లిదండ్రులు ఆనందభాష్పాలతో తడిసిపోయారు. వారికి ఒక్కగానొక్క బిడ్డ హసన్. ఆసుపత్రిలో చేర్చే సమయానికి అతని మెడ వేలాడిపోతోంది. దీంతో అతను బతకడని వారు నిర్ణయించుకున్నారు. కానీ వైద్యుల కఠోర శ్రమతో ఆ పిల్లాడికి తిరిగి ప్రాణం పోసి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. 


ఆపరేషన్ జరిగి నెల రోజులు దాటిన తర్వాత కూడా హసన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవు. నరాల లోపాలు, పంచేంద్రియాలు పనిచేయకపోవడం, కండరాలు పని చేయకపోవడం వంటి సమస్యలేవీ లేవు. రక్తనాళాలు కూడా చక్కగానే పనిచేస్తున్నాయి. దీంతో శాస్త్ర చికిత్స విజయవంతమైనట్టు భావిస్తున్నారు వైద్యులు. ఇక పొత్తికడుపు భాగంలో తీవ్రంగా దెబ్బలు తాకడంతో అక్కడ స్ప్లింట్ ను వేశారు వైద్యులు. హసన్ కోలుకోవడం అద్భుతం అని చెబుతున్నారు వైద్య రంగంలోని నిపుణులు. 


Also read: ఆవులింతలు అధికంగా వస్తున్నాయా? అయితే ఈ ఐదు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం




Also read: ప్రపంచంలోనే ప్రమాదకరమైన చెట్లు ఇవి, వీటి కింద నిలుచున్నా ప్రాణాపాయమే























































































































































































































































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.