జ్యూస్... ఓ శునకం అందమైన పేరు ఇది. ఇప్పుడు ఆ కుక్క ప్రపంచంలోన అతి ఎత్తయిన కుక్కగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. చూస్తే భూమికి చెందిన జీవిలా కనిపించదు. అంతెత్తుగా గ్రహాంతరవాసిలా దర్శనమిస్తుంది. ఇది అమెరికన్ గ్రేట్ డేన్ జాతికి చెందిన శునకం. మూడు అడుగుల అయిదు అంగుళాల ఎత్తు పెరిగింది. ప్రస్తుతం దీని వయసు రెండేళ్లే. ఇంకా పొడవు, ఎత్తు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. టెక్సాస్ లోని బెడ్ ఫోర్డ్ ప్రాంతంలో నివసిస్తున్న బ్రిటనీ డేవిస్ కుటుంబం జ్యూస్ ను పెంచుకుంటోంది. చిన్నప్పట్నించి గ్రేట్ డేన్ జాతికి చెందిన కుక్కను పెంచుకోవాలని కోరిక అని జ్యూస్ తో ఆ కోరిక తీరిందని చెబుతోంది బ్రిటనీ.
పుట్టినప్పట్నించే అన్ని శునకాలతో పోలిస్తే జ్యూస్ కాస్త పెద్దగా ఉండేదంట. జ్యూస్ తల్లికి అయిదు పిల్లలు ఒకే కాన్పులో జన్మిస్తే, వాటన్నింటిలో పెద్దగా పుట్టింది జ్యూస్. ఈ శునకానికి పందులన్నా, వర్షమన్నా చాలా భయం. ప్రపంచంలోనే జ్యూస్ అతి ఎత్తయిన కుక్క అవుతాడని ఎప్పుడూ అనుకోలేదని, ఓసారి సరదాగా కొలిచామని చెప్పుకొచ్చింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన కుక్కను కలిగి ఉంటామని ఎప్పుడూ ఊహించలేదంటూ ఆనందపడుతోంది బ్రిటనీ. చాలా వేగంగా పరుగెత్తగలడం ఈ శునకం స్పెషాలిటీ. ఆ ప్రాంతంలో జ్యూస్ ఒక సెలెబ్రిటీ. స్థానిక రైతు బజార్లలో షికార్లు చేయడానికి వెళుతుంది. కిటికీ పక్కన పడుకుని ఆకాశాన్ని చూస్తూ ఆస్వాదిస్తుంది.
గతంలో కూడా గ్రేట్ డేన్ జాతికి చెందిన కుక్కే ఎత్తయినదిగా రికార్డులకెక్కింది. విచిత్రంగా దాని పేరు కూడా జ్యూస్. కానీ అది 2014లో మరణించింది.
Also read: షిగెల్లా బ్యాక్టిరియా వల్ల మనదేశంలో తొలి మరణం? జాగ్రత్త ఈ బ్యాక్టిరియా అంటువ్యాధి
Also read: అప్పట్లో తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టేవారు, ఎందుకు? సైన్సు ఏం చెబుతోంది?