మనదేశంలో భాగమై ఉండి కూడా తమ చట్టాలను, తమ న్యాయాలను, కట్టుబాట్లను, పార్లమెంటును విడిగా నడుపుకుంటున్న గ్రామం మలానా. ఇప్పటికీ తమను తాము ప్రపంచం నుంచి వేరుగా ప్రత్యేకంగా చూసుకుంటారు ఆ గ్రామస్తులు. ఈ విచిత్ర గ్రామం హిమాచల్ ప్రదేశ్ లోని కసోల్ నగరానికి దగ్గర్లో రెండు లోయలకు మధ్య ఉంది. మలానా గ్రామం చాలా ప్రత్యేకమైనది. వీరి జీవనశైలి, సామాజిక నిర్మాణం, ప్రజల ఆచార వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయి. వీరికి ప్రత్యేక పార్లమెంటు కూడా ఉంది. తమను వేరే దేశంగా భావిస్తారు ఇక్కడి ప్రజలు. మీరు మాట్లాడే భాష కనాషి.
ప్రపంచంలోని అతి పురాతన ప్రజాస్వామ్య దేశాలలో తమ దేశం మలానా కూడా ఒకటని ఇక్కడ గ్రామస్తులు భావిస్తారు. వీరంతా ఆర్యుల నాగరికత వారసులమని నమ్ముతారు. ఈ గ్రామానికి చేరుకోవడం చాలా కష్టం. వీరి న్యాయవ్యవస్థ వేరేగా ఉంటుంది. గ్రామానికి రెండు సభలు ఉన్నాయి. ఇందులో దిగువసభను కనిష్తాంగ్ అని, ఎగువసభను జయేష్తాంగ్ అని పిలుస్తారు. ఈ రెండే ఆ గ్రామ పార్లమెంట్ కింద లెక్క.
ఈ గ్రామ ప్రజలు జనపనారతో బుట్టలు, తాళ్లు, చెప్పులు అల్లడం పై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఊర్లో గంజాయిని శతాబ్దాలుగా చట్టబద్ధమైన పంటగా సాగు చేస్తున్నారు. చివరికి ఇప్పుడు మలానా డ్రగ్ టూరిజానికి గమ్యస్థానంగా మారింది. అలాగే ఈ గ్రామంలో మొక్కజొన్న, బంగాళాదుంపలను కూడా పండింస్తారు. ఈ ప్రత్యేకమైన గ్రామాన్ని చూడ్డానికి పర్యాటకులు వేలాదిగా వస్తారు. ఇప్పుడు ఇదే ఆ గ్రామ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అయితే వచ్చిన పర్యాటకులు ఎవరూ కూడా గ్రామం లోపల నివసించడానికి వీల్లేదు. గ్రామానికి దూరంగా కేఫ్‌లు, షెడ్లలో నివసించాలి.
ఏది టచ్ చేసినా ఫైన్
ఈ గ్రామంలోని అడుగు పెట్టాక చాలా జాగ్రత్తలు పాటించాలి. గ్రామస్తులను బయట వ్యక్తులు ఎవరూ ముట్టుకోకూడదు. వారి వస్తువులను కూడా తాకకూడదు. ఏమైనా షాపుల్లో కొనాలనుకుంటే డబ్బులు నేల మీద పెడితే, గ్రామస్తులు వస్తువులను కూడా నేల మీద పెడతారు. అలా తీసుకోవాలి తప్ప చేత్తో ఇచ్చుకోవడానికి వీల్లేదు. గ్రామంలోని దేవాలయాల గోడలను తాకకూడదు. దేవాలయాలను బయట నుంచే, దూరం నుంచి చూసి వెళ్ళిపోవాలి. గ్రామంలో చెక్కలను కాల్చి మంట పెట్టడానికి వీల్లేదు. వీడియోలు తీయకూడదు. చికెన్ వంటివి తినకూడదు. గ్రామస్తులు మాట్లాడే కనాషి అనే స్థానిక భాషను నేర్చుకునేందుకు ప్రయత్నించకూడదు. అలాగే ఏ కారణం చేత కూడా తమతో పాటు పోలీసులను గ్రామంలోకి తీసుకురాకూడదు.
గ్రామంలో కనిపించే ఆడవారితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు. అది చాలా పెద్ద నేరం. గ్రామంలో ఉన్న నియమ నిబంధనలు నచ్చకపోతే నిశ్శబ్దంగా వెళ్లిపోవాలి. కానీ అక్కడ ఉన్న స్థానికులతో వాదించకూడదు. ఇక్కడ చెప్పిన ఏ పనులు చేసినా కూడా వారికి 2500 రూపాయలు ఫైన్ విధిస్తారు. ఆ మొత్తం కట్టాకే గ్రామం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు.
Also read: మీరు తెలివైన వారైతే ఇక్కడున్న ఇద్దరి స్త్రీలలో ఆ చిన్నారి తల్లి ఎవరో కనిపెట్టండి