కేజీయఫ్ సినిమా ఎంతో మందికి హాట్ ఫేవరేట్. ఆ సినిమా చూసినవారిలో చాలా మంది అలాంటి బంగారు గనుల్లేవని, అది కేవలం సినిమా అని అనుకున్నారు. అంత పెద్ద బంగారు గనులు ఉంటాయన్న నమ్మకం కూడా వారికి లేదు. కేజీయఫ్ సినిమాలో చూపించిన విధంగా బానిస బతుకులు లేకపోయినా, అలాంటి బంగారు గని మాత్రం ఉంది. అది కేజీయఫ్ కు ఎన్నో రెట్లు పెద్దది. ప్రపంచంలో చాలా చోట్ల బంగారు గనులు ఉన్నాయి. వాటి అన్నింటి కన్నా ఇదే అతి పెద్ద బంగారు గని. ఇక్కడ్నించి బంగారం చాలా ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. 


ఆ బంగారు గని ఇదే...
ఇంతకీ ఈ బంగారు గని ఎక్కడుందని ఆలోచిస్తున్నారా? మనదేశంలో మాత్రం కాదు. అమెరికాలోని నెవడా ప్రాంతంలో. ఇక్కడ ఉండే అతి పెద్ద గోల్డ్ మైన్ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ్నించి ప్రతి ఏడాది లక్షల కిలోల బంగారాన్ని తీస్తారు. వీటి విలువ కొన్ని వందల కోట్లు ఉంటుంది. ఈ బంగారు గని ద్వారా అమెరికాకు ఎంత ఆదాయం వస్తుందో లెక్కించలేం కూడా. ఒక అంచనా ప్రకారం ఏటా లక్షా 70 వేల కిలోలు బంగారాన్ని తీస్తారు. ఇక అంత బంగారం ఎంత విలువ చేస్తుందో చెప్పడం కూడా కష్టమే.  ఒక్క 2018లోనే 176 టన్నులు వెలికితీశారంట. ప్రపంచంలో ఉన్న బంగారంలో అయిదు శాతం బంగారు నగలు ఈ గని నుంచి తీసిన సువర్ణంతోనే తయారుచేస్తారు. రెండు సంస్థలు లీజుకు తీసుకుని ఈ గని నుంచి బంగారాన్ని బయటికి తీస్తున్నాయి. ఏడు వేల మంది పనివారు రోజూ గనిని తవ్వేపనిలో ఉంటారు. 1870లో ఈ బంగారు గనిని కనిపెట్టారు. కానీ చాలా చిన్న ప్రాంతంలోనే ఈ గని ఉందనుకున్నారు. కానీ 1900 సంవత్సరం దాటాకా మాత్రం ఈ గని అనుకున్నంత చిన్నది కాదని, భూమిలో సువర్ణాన్ని భారీగా దాచుకుందని తేలింది. ఇక అప్పట్నించి పనివారిని పెంచి బంగారాన్ని తవ్వడం ప్రారంభించారు. 


మనదేశంలో ఎక్కడున్నాయి?
భారతదేశంలో కూడా బంగారు గనులు అధికంగానే ఉన్నాయి. అధికంగా కర్ణాటకలో ఉన్నాయి. మనదేశంలో ఉన్న బంగారంలో 88 శాతం కర్ణాటకలోనే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ లలో కూడా చిన్న గనులను కనుగొన్నారు. కర్ణాటకలోని రాయచూర్ లో ఉన్న హట్టి గోల్డ్ గని ఇప్పటి వరకు 84 టన్నులకు పైగా బంగారాన్ని ఉత్పత్తి చేసింది. మనదేశంలో ఇదే ముఖ్యమైన బంగారు గని. అయితే ఈ బంగారం మనకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర బంగారం అధికంగా వాడతాం. అందుకే మనం ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. 


రెండో స్థానంలో అదే...
ప్రపంచంలో అతి పెద్ద బంగారు గనిగా నెవడా బంగారు గని మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో ఉజ్బెకిస్తాన్లోని మురుంటా గని నిలిచింది. మూడో స్థానంలో ఇండోనేషియాలోని గ్రాస్బెర్గ్ గని నిలిచింది. నాలుగో స్థానంలో రష్యాలోని ఒలింపియాడా ఉంది. 


Also read: రోజూ ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పనిచేసేవారికి షాకింగ్ న్యూస్, అలా కూర్చుంటే ఈ గుండె సమస్యలు తప్పవు


Also read: వెదురు బొంగు కొనుక్కోండి, ఇంట్లోనే ఇలా బొంగులో చికెన్ వండేయండి