South Indian Breakfast : రోజూ తినే ఇడ్లీలకు బదులు టేస్టీగా ఉండే ఇడ్లీలు తినాలనుకుంటున్నారా? అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. ఇది కేవలం రుచిని మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యాన్ని కూడా మీకు అందిస్తుంది అంటున్నారు ఆహార నిపుణులు. మరి దీనిని ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సి పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
ఇడ్లీ రవ్వ - 1 కప్పు
మినపప్పు - అర కప్పు
మెంతులు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
పాలకూర - అర కప్పు
పనీర్ - అర కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
అల్లం - అంగుళం
నూనె - అవసరానికి తగినంత
తయారీ విధానం
ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో మినపప్పు వేసి దానిని బాగా కడిగి ఓ గంట నానబెట్టాలి. దానిలో మెంతులు కూడా వేసి నాననివ్వాలి. మరో గిన్నెలో ఇడ్లీ రవ్వ తీసుకుని దానిని కూడా కడిగి నానబెట్టాలి. మీరు ఇడ్లీ చేసుకోవాలనుకునే గంటన్నర ముందు దీనిని నానబెట్టుకోవాలి. పాలకూరను బాగా కడిగి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. పనీర్‌ను తురిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కడిగి సన్నని ముక్కలుగా కోసుకోవాలి. అల్లం కూడా సన్నగా తురుముకోవాలి.
మినపప్పును నానిన తర్వాత దానిని బాగా కడిగి మిక్సీలో గ్రైండ్ చేయండి. దానిలో ఉప్పు వేసి బాగా కలపండి. కొన్నిగంటలు దానిని అలాగే ఉండనివ్వండి. అనంతరం స్టౌవ్ వెలిగించి దానిలో కడాయిపెట్టండి. దానిలో ఉల్లిపాయలు వేసి వేయించండి. కాస్త నూనె వేసి కలిపి.. దానిలో పాలక్, పనీర్ కూడా వేసి ఫ్రై చేయండి. దానిలో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలపండి. అవి వేగిన తర్వాత స్టౌవ్‌ను ఆపేయండి. ఇడ్లీ అచ్చులకు నూనె అప్లై చేసి.. వాటిలో ఇడ్లీ పిండిని వేయాలి. దానిపై పాలక్ మిశ్రమాన్ని వేయాలి. పాలక్ మిశ్రమాన్ని మరీ ఎక్కువ కాకుండా చూసుకోండి.
స్టౌవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్‌ను ఉంచండి. సుమారు పది నుంచి పదిహేను నిమిషాలు ఆవిరి మీద వాటిని ఉడికించండి. వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. దీనిని మీకు నచ్చిన చట్నీ లేదా సాంబార్‌తో కలిపి తీసుకోవచ్చు. ఇవి ప్రోటీన్‌కు మంచి సోర్స్ అని చెప్పవచ్చు. కాబట్టి జిమ్ చేసే వారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు వీటిని తయారు చేసుకోవచ్చు. పాలకూరను నేరుగా తినడం ఇష్టం లేని వారు ఇలా తీసుకోవడం వల్ల స్కిన్, హెయిర్‌కి మంచి బెనిఫిట్స్ పొందవచ్చు.
పిల్లలు కూడా కొన్నిసార్లు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు. బ్రేక్‌ఫాస్ట్‌లలో పాలకూరను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. పిలల్లో ఎదుగుదల కూడా మంచిగా ఉంటుంది. మధుమేహమున్నవారు కూడా దీనిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవచ్చు. ఇది అధికరక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేసి చిరుతిళ్లకు దూరంగా ఉండేలా చేస్తుంది.
Also Read : మల్టీగ్రెయిన్ లడ్డూల రెసిపీ.. పిల్లల ఎదుగుదలకు ఇవి చాలా మంచివి