వేసవిలో ఎంత నీరు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటారు. సాధారణంగా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో ఈ సంఖ్య కాస్త పెంచినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వేడి ఉష్ణోగ్రత కారణంగా శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. శరీరానికి తగినంత నీరు అందకపోతే అవయవాల పనితీరు మందగిస్తుంది. అందాన్ని పాడు చేస్తుంది. డీహైడ్రేషన్ వల్ల చర్మం పేలవంగా నిర్జీవంగా కనిపిస్తుంది. చర్మం మీద పగుళ్లు ఏర్పడతాయి. అందుకే నీటిని తీసుకోవాలి. నార్మల్ వాటర్ తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఒక గ్లాసు వాటర్ లో అప్పుడప్పుడు వీటిని కలుపుకుని తాగారంటే రుచిగా ఉంటాయి.
నిమ్మకాయ
ప్రతిరోజూ పొద్దున్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించేస్తుంది. బరువు అదుపులో ఉంటారు. నోరు కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుంది.
పుదీనా ఆకులు
అదనపు కిలోలను సాధారణం కంటే వేగంగా కరిగించే గొప్ప గుణం పుదీనాకు ఉందని నిపుణులు అంటున్నారు. దీన్ని టీ లేదా పుదీనా రసం ఎలా తీసుకున్నా ఆరోగ్యకరమే. పొట్ట కొవ్వును వేగంగా తొలగిస్తుంది. పొట్టలోని గ్యాస్ ని బయటకి పంపించేందుకు సహాయపడుతుంది. పేగు కదలికల్ని సులభతరం చేస్తుంది. పుదీనా ఆకులు కొన్ని నీటిలో కాసేపు నానబెట్టి ఆ నీటిని తాగితే చాలా బాగుంటాయి. నీటి రుచిని మెరుగుపరుస్తాయి.
దోసకాయ
ఈరోజుల్లో ట్రెండ్ లో ఉన్న డిటాక్స్ వాటర్ అనగానే మనకు దోసకాయ గుర్తుకు వస్తుంది. కీరదోస ముక్కలు గుండ్రంగా, సన్నగా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకుని తాగొచ్చు. యవ్వనంగా కనిపించేలా చేయడంలో చక్కగా పని చేస్తుంది. చర్మానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఇందులో ఉన్నాయి.
జీలకర్ర
జీరా నీటిని ఉదయాన్నే తాగడం వల్ల అనేక జీర్ణ సమస్యలు నయమవుతాయి. పొద్దున్నే పరగడుపున ఈ నీటిని తాగితే పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్య తొలగిపోతుంది.
సాన్ఫ్
సాన్ఫ్ నీరు పేగులకు మంచిది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి సహాయపడుతుంది. సాన్ఫ్ అంటే సోంపు గింజలు. ఇడి కూడా ఆహారం జీర్ణమయ్యేలా చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది.
అల్లం
ఒక గ్లాసు నీటిలో అల్లం రసాన్ని జోడించడం వల్ల దీర్ఘకాలిక కడుపు సమస్యల్ని పరిష్కరిస్తుంది. పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
చియా విత్తనాలు
నల్లగా చిన్నగా ఉండే చియా విత్తనాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టుకుని ఉదయాన్నే తినాలి. ఇవి నానబెట్టిన తర్వాత చూసేందుకు కాస్త సబ్జా గింజలు మాదిరిగా కనిపిస్తాయి.
యాపిల్ సిడర్ వెనిగర్
ఒక గ్లాసు నీటిలో 1-2 టేబుల్ స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్ కలుపుకుని తాగితే జీవక్రియను వేగవంతం చేస్తుంది. కానీ యాపిల్ సిడర్ వెనిగర్ నేరుగా తీసుకోకూడదనే విషయం తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి.
దాల్చిన చెక్క
ఏదైనా పానీయానికి కొన్ని దాల్చిన చెక్కలను జోడించడం వల్ల దాని రుచి, పోషక విలువలు పెరుగుతాయి. పొట్ట సమస్యలను తొలగిస్తుంది.
కాలానుగుణ పండ్లు
సీజనల్ పండ్ల ముక్కలు నీటిలో వేసుకుని రోజంతా నానబెట్టుకుని ఆ నీటిని తాగొచ్చు. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి ఇదొక గొప్ప మార్గం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా? ఇదే కారణం కావచ్చు