RBI Locker Guidelines : బంగారానికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే దీనిని చాలామంది కొంటూ ఉంటారు. ఫంక్షన్ల సమయంలో వేసుకోవడానికే కాదు.. ఇన్వెస్ట్​మెంట్​లో భాగంగా కూడా బంగారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా కొన్న గోల్డ్​ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా మరి. దొంగల నుంచి, ఇతర ప్రమాదాల నుంచి బంగారాన్ని కాపాడుకునేందుకు ఎక్కువమంది ఆశ్రయించే ప్లేస్ బ్యాంక్. 

Continues below advertisement


అవును. చాలామంది గోల్డ్​ని బ్యాంక్​ లాకర్​లో ఉంచుతారు. అక్కత తమ బంగారం భద్రంగా ఉంటుందని భావిస్తారు. అయితే నిజంగానే బ్యాంక్ లాకర్​లో బంగారం సురక్షితంగా ఉంటుందా? RBI గైడ్​లైన్స్ ఏంటి? గోల్డ్​ బ్యాంక్​ లాకర్​లో పెట్టేముందు తెలుసుకోవాల్సిన విషయాలేంటి వంటివి ఇప్పుడు చూసేద్దాం. 


ఆర్బీఐ గైడ్ లెన్స్.. 


గతంలో బ్యాంకులు లాకర్​లో ఉన్న వస్తువులు దొంగతనం లేదా ఇతర నష్టం జరిగితే బ్యాంక్​ దానికి బాధ్యత వహించదు అనే రూల్ ఉండేది. అయితే ఆ నింబంధనకు ఆర్బీఐ 2021లో మార్పులు చేసింది. బ్యాంకులు.. లాకర్ల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని.. కస్టమర్ లాకర్​లో పెట్టిన వస్తువులకు బాధ్యులుకామని చెప్పకూడదని.. నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితే కచ్చితంగా బాధ్యత తీసుకోవాలని 2021లో మార్గదర్శకాలు చేసింది. 


నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితే బ్యాంక్ లాకర్ సంవత్సర రెంటుకి 100 రెట్లు వరకు నష్ట పరిహారం చెల్లించాలని సూచించింది. 2022, జనవరి 1 నుంచి ఈ గైడ్​లైన్స్ అమలవుతున్నాయి. అలాగే భూకంపం, వరదలు వంటి వల్ల గోల్డ్ పోతే బ్యాంకులు వాటికి బాధ్యత వహించవు. కస్టమర్లకు ఎలాంటి డబ్బులు చెల్లించవనేది కూడా ఆర్బీఐ నిబంధనే. 


నిపుణుల సలహా ఇదే


బంగారాన్ని బ్యాంక్​ లాకర్​లో ఉంచుకోవాలనుకునేవారు ఓ టిప్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. అదేంటంటే.. మీరు గోల్డ్ లాకర్​లో బంగారం పెడితే.. బ్యాంక్​ లాకర్​ రెంట్​ను 100 సార్లు కట్టగా ఎంత ఖర్చు అవుతుందో లెక్క చూసుకుని.. అంతే మొత్తం లేదా అంతకంటే తక్కువ గోల్డ్ మాత్రమే లాకర్​లో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. రెంట్ లిమిట్​ కంటే ఎక్కువ గోల్డ్ పెడితే మీరు రిస్క్​ తీసుకుంటున్నట్టేనని చెప్తున్నారు. 


కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు


చాలా బ్యాంకులు లాకర్​లో ఉన్న వస్తువులకు బీమా ఇవ్వవు. కాబట్టి మీరు కావాలంటే బీమా పాలసీ తీసుకోవచ్చు. అలాగే గోల్డ్ బ్యాంక్​ లాకర్​లో పెట్టే ముందు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. లాకర్ ఒప్పందాన్ని పూర్తిగా చదవాలి. మీరు ఉంచే బంగారం, నగలు మొదలైన వాటిని ఫోటోలు తీసి.. వివరాలు జాగ్రత్త చేసుకోవాలి. కనీసం ఆరు నెలలకోసారి లాకర్​ను చెక్ చేసుకోవాలి.