ఆకలిని మనం చాలా సాధారణంగా భావిస్తాం. అయితే, అది మన శరీరంలో జరుగుతున్న మార్పులకు, సమస్యలకు కూడా సంకేతాన్నిఇచ్చే లక్షణమని మనం తెలుసుకోవాలి. లేకపోతే.. మున్ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆకలి వేస్తుందంటే.. ఆహారం తింటే సరిపోతుందిలే అని అనుకుంటాం. కానీ, ఈ కింది కారణాన్ని మీరు అస్సలు ఊహించలేరు. అదేంటో తెలుసుకుని ఇకపై ఆరోగ్యంపై శ్రద్ధపెట్టండి.
శరీరంలోని ప్రతి కణానికి ప్రోటీన్ అవసరం. రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే ప్రోటీన్ తప్పనిసరి. అన్నల్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఆఫ్ మెటబాలిజంలో ప్రచురించిన మార్గదర్శకాల ప్రకారం శారీరక శ్రమ చేసే ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకి కనీసం 0.8 గ్రాముల ప్రోటీన్/ కేజీ శరీర బరువు ఉండాలి. ప్రోటీన్ 20 రకాల అమైనో ఆమ్లాలతో తయారవుతుంది. వాటిలో 9 అమైనో ఆమ్లాలు ఆహారం ద్వారా పొందుతారు. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే రోగాలు దాడి చేస్తాయి. ప్రోటీన్ లోపం సంభవిస్తే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
ఎముకల పగుళ్లు: ఎముక కణాల నిర్మాణాన్ని తయారు చేయడం కోసం ప్రోటీన్ సహాయపడుతుంది. ప్రోటీన్ లోపిస్తే ఎముకలు బలహీనపడిపోతాయి. పగుళ్ళ ప్రమాదాన్ని పెంచుతాయి. చిన్న గాయాలు తగిలినా కూడా ఎముకలు విరిగిపోవడం జరుగుతుంది.
రోగనిరోధక శక్తి తక్కువ: శరీరానికి సరిపడా ప్రోటీన్ అందక పోతే రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. అప్పుడు త్వరగా రోగాల బారిన పడతారు. వర్షాకాలంలో రోగాలను ఎదుర్కోవాలంటే తప్పకుండా ప్రోటీన్ పుష్కలంగా లభించే ఆహారాలు తీసుకోవాలి.
జుట్టు రాలిపోవడం: ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, గోళ్ళకి ప్రోటీన్ చాలా అవసరం. జట్టు పల్చబడి పోతుంది. గోళ్ళు పెళుసుగా మారిపోయి ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి. చర్మం పేలవంగా కనిపిస్తుంది.
ఆకలి: తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం వల్ల నిరంతరం ఆకలిగా అనిపిస్తుంది. ఎక్కువగా తినేలా చేస్తుంది. ఆకలిని అణుచుకునేందుకు జంక్ ఫుడ్ మీద పడిపోతారు. ఫలితంగా బరువు పెరగడం, ఊబకాయం, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కావలసినంత ప్రోటీన్ అందితే పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు.
కండరాలు బలహీనం: శరీరానికి తగినంత ప్రోటీన్ లభించకపోతే కండరాలు బలహీనంగా మారతాయి. కండర ద్రవ్యరాశిని కోల్పోతారు. కండరాల పెరుగుదల, నిర్మాణానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది క్షీణించినప్పుడు కండరాలు బలహీనమైపోతాయి.
చక్కెర తినాలని కోరిక: ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగడానికి దారి తీస్తుంది. వెంటనే తగ్గిపోతుంది. షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గుల కారణంగా చక్కెర తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది.
అలసట: ప్రోటీన్ లోపం ప్రారంభ సంకేతాలలో ముందుగా కనిపించేది అలసట, బలహీనత. శరీరం పప్పు లేదా చికెన్ తినాలని ఆశపడుతూ ఉంటుంది. ఇది ప్రోటీన్ లోపానికి మరొక సంకేతం కావచ్చు.
ఫ్యాటీ లివర్: క్వాషియోర్కర్ ప్రోటీన్ పోషకాహార లోపానికి తీవ్రమైన సంకేతం. సాధారణంగా ప్రపంచంలో పేదరికంతో బాధపడుతున్న శిశువులు, పిల్లలని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యకు దారి తీస్తుంది.
ఎడెమా: శరీర భాగాల్లో వాపు కనిపిస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ఎడెమా అంటారు. తీవ్రమైన ప్రోటీన్ లోపానికి మరొక సంకేతం.
ప్రోటీన్ ఎలా పొందాలి?
పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, చినే, పెరుగు, చేపలు, గుమ్మడి కాయ గింజలు, కాయధాన్యాలు వంటివి వాటిలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. శాఖాహారులు అయితే తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. చిక్కుళ్ళలో ప్రోటీన్ లభిస్తుంది. అవిసె గింజలు, సోయా బీన్స్, ఓట్స్, పచ్చి బఠానీ, వేరుశెనగలో ప్రోటీన్ ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: డాక్టర్స్ ఆరోగ్యంగా ఉండేందుకు ఫాలో అయ్యే చిట్కాలు ఇవే, మీరూ పాటించండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial