దాదాపు పది లక్షల మందికి పైగా బ్రిటీష్ ప్రజలు వారికి టైప్-2 డయాబెటిస్ ఉందన్న విషయం తెలియకుండా బతుకుతున్నారని ఈ మధ్య ఒక అధ్యయనం బయటపెట్టింది. టైప్-2 డయాబెటిస్ లక్షణాలు గుర్తించటం కష్టం. కొన్ని సంవత్సరాలుగా వ్యాధి లక్షణాలు బయటపడకుండా ఉంటాయి. టైప్-2 డయాబెటిస్ రక్తంలో చెక్కర స్థాయిలను పెంచుతుంది. ఇది గుర్తించి వైద్యం తీసుకోకపొతే ఎంతో ప్రమాదకరం.


యువతకు టైప్-2 డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. అంచనాల ప్రకారం, టైప్-2 డయాబెటిస్ ఎక్కువ ఉన్నది పెద్దవారిలోనే అయినప్పటికీ, యువత వారికి ఈ వ్యాధిని గుర్తించటానికి పరీక్షలు చేసుకొవట్లేదని ఈ అధ్యయనం చెప్పింది. 16 నుంచి 44 ఏళ్ళ వయసు గలవారు 50 శాతం మంది, 75 ఏళ్ల వయస్సు గల వారు 27 శాతం మంది డయాబెటిస్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడంలేదని గణంకాలు తెలుపుతున్నాయి.


డయాబెటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి?


బ్రిటీష్ నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం, టైప్-2 డయాబెటిస్ ను ఈ లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు:


⦿ మాటిమాటికీ మూత్రానికి వెళ్ళటం. ముఖ్యంగా, రాత్రిపూట.
⦿ ఎప్పుడూ దాహం వేస్తూ ఉండటం.
⦿ నీరసంగా అనిపించటం.
⦿ అనుకోకుండా బరువు తగ్గటం.
⦿ యోని/అంగం మీద దురదగా ఉండటం.
⦿ దెబ్బలు మానటానికి చాలా సమయం పట్టటం.
⦿ కళ్లు మసకగా కనిపించటం.


టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో సాధారణంగా ఈ లక్షణాలన్నీ కనిపించినట్టు గుర్తించారు. మీకుగానీ ఈ లక్షణాలు ఉంటే సంబంధిత వైద్యున్ని సంప్రదించటం అవసరం. ఇవి కాకుండా జాగ్రత్త పడవలసిన మరి కొన్ని లక్షణాలు కూడా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో కనిపించాయి.


⦿ చర్మం పెచ్చులు ఊడటం.
⦿ తరచుగా జబ్బు పడుతుండటం.
⦿ దురదలు.
⦿ నోరు తడారిపొవటం.
⦿ చికాకు.
⦿ చర్మం మొద్దుబారినట్టు అనిపించటం.
⦿ దంతాలు పాడవటం.
⦿ నోటి నుంచి వింత వాసన రావటం.


టైప్-2 డయాబెటిస్ జన్యుపరంగాను,అంటే రక్తసంబంధీకుల నుంచి వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే, ఊబకాయం ఉన్నవారికి ఎక్కువగా టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మీకు డయాబెటిస్ ఉందో, లేదో గుర్తించటానికి కొన్ని ఆన్లైన్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి.


టైప్-2 డయాబెటిస్ నుంచి ఎలా బయటపడాలి?


⦿ మీకు టైప్-2 డయాబెటిస్ ఉందని తేలితే, కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలి.
⦿ ప్రతిరోజూ, వ్యాయామం చేయాలి.
⦿ రక్తపరీక్షలతో పాటు, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 
⦿ ధూమపానం, మద్యపానం అలవాటు ఉంటే తగ్గించాలి లేదా పూర్తిగా మానివేయాలి.


టైప్-2 డయాబెటిస్ తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కచ్చితంగా వీరికి టాబ్లెట్లు గానీ, ఇంజెక్షన్లు గానీ అవసరం. మరికొంత మంది బరువు తగ్గటం వల్ల, రక్తంలో చెక్కర స్థాయిలు తగ్గి డయాబెటిస్ తీవ్రతను తగ్గించుకుంటారు. మరికొంతమంది, తక్కువ కాలరీలు ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల తీవ్రత తగ్గించుకుంటారు. కానీ ఇది అందరికీ సరిపడదు. దీనికి నిపుణుల సలహా తీసుకోవటం అవసరం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.