ఇంటిని చాలా సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు ఎవరైనా. మీ ఇల్లు నిజంగా సురక్షితమేనా? ఓసారి ఆలోచించండి. మీ కిచెన్ ను పరిశుభ్రంగానే కాదు, ఎలాంటి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు లేకుండా సేఫ్ జోన్‌లో ఉంచారా? మీరు కిచెన్ లో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తేనే మీ ఇల్లు అగ్నిప్రమాదాలకు తావు లేని సేఫ్ జోన్ కిందకి వస్తుంది. ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ వాడకం అధికమైన రోజుల్లో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లండన్ కు చెందిన ఫైర్ బ్రిగేడ్లు ప్రపంచ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. కిచెన్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలా చూసుకోవాలో వివరించారు. 


1. వంటగదిలో పని ముగించుకుని బయటికి వచ్చే ముందు స్టవ్ తో పాటూ అన్ని ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ ఆఫ్ చేసి ఉన్నాయో లేవో చూసుకోండి. రైస్ కుక్కర్, ఓవెన్, మిక్సర్, టోస్టర్... ఇలా అన్నీ ఆపేసి ఉండాలి. 
2. మీకు ఆరోగ్యం బాగా లేనప్పుడు అంటే నీరసంగా, మగతగా ఉన్నప్పుడు వంట జోలికి పోకండి. ఆ నీరసంలో, మగతలో చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించలేరు. దీని వల్ల అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే తీవ్ర అలసిపోయినప్పుడు, మద్యం సేవించినప్పుడు కూడా వంటజోలికి పోకూడదు. ఆర్డర్ పెట్టుకుని తినేయడం మంచిది. 
3. వంట చేసేటప్పుడు మీరు వేసుకునే దుస్తులు సరిగా ఉండాలి. వదులుగా, వేలాడుతూ ఉండేవి, సిల్క్ చీరలు వంటివి వద్దు. సింథటిక్ వేర్ త్వరగా అంటుకుంటుంది. జుట్టు కూడా గట్టిగా ముడి వేసుకుని వంట చేయండి. వదులైన జుట్టుతో స్టవ్ దగ్గర వంగి పనిచేయడం చాలా డేంజర్. 
4. చాలా మంది వంట చేసేటప్పుడు వేడి గిన్నెలు దించడానికి చిన్న టవల్స్ వంటివి వాడతారు. అలాగే చీర కొంగులతో దించేయడం, చున్నీలు వాడడం చేస్తుంటారు ఇది మంచి పద్ధతి కాదు. దానికి గ్లవ్స్ అమ్ముతారు అవి కొనుక్కోవడం ఉత్తమం. 
5. అగ్గిపెట్టెలు వాడడం మానేయండి. అగ్గిపుల్లలు ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. 
6. టోస్టర్లు, రైస్ కుక్కర్లు వాడేశాక ప్లగ్ లు తీసి పక్కన పెట్టేయాలి. అక్కడ మంట అంటుకునే వస్తువులేవీ లేకుండా చూసుకోవాలి. 
7. ఓవెన్ వాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మైక్రోఓవెన్లో మెటల్ వస్తువులు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఇంటర్నల్ సర్క్యూట్ల వల్ల ఓవెన్లో మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. 


దుస్తులుకు నిప్పంటుకుంటే...
ఒక్కోసారి అజాగ్రత్తగా ఉండడం వల్ల చీరకొంగులు, దుపట్టాలు అంటుకునే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు భయంతో ఇటూ అటూ పరుగెడితే మంటలు మరింతగా చెలరేగుతాయి. అలా నిప్పు అంటుకున్నప్పుడు నేల మీద పడి ఇటూ అటూ దొర్లుతూ మంటను ఆపే ప్రయత్నం చేయాలి. మందపాటి దుప్పటిని కప్పుకుని మంటలు ఆపేయాలి. నిప్పుకు గాలి తోడైతే మంటలు పెరిగిపోతాయి. 


Also read: కొడుకు పుట్టాలని కోరుకునే జంటల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది, సర్వేలో తేలిన విషయం


Also read: కొవ్వును కరిగించే లైపోసక్షన్ ఆపరేషన్ ఎలా చేస్తారు? అది ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఎందుకు మారుతోంది?