జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు నోటికి చాలా రుచిగా ఉంటాయని తెగ లాగించేస్తారు. కానీ పొట్ట చుట్టూ కొవ్వు చేరే దాకా తెలియదు వాటి వల్ల వచ్చిన నష్టం ఏంటో. ఇక దాన్ని కరిగించుకోవడానికి తిప్పలు పడతారు. ఒళ్ళు తగ్గించుకోవడానికి జిమ్ లో చెమటోడ్చి కష్టపడి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇదే కాదు శరీరంలోని కొవ్వుని తగ్గించుకునేందుకు తినాలి కూడా. అయితే ఆ తినాల్సిన ఆహారాల విషయంలోనే కాస్త శ్రద్ధ పెట్టాలి.


సుగంధ ద్రవ్యాలు మంచి సువాసన, రుచి మాత్రమే కాదు కొవ్వుని కూడా కరిగించేస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఆకుపచ్చని ఈ పదార్థాలు క్రమం తప్పకుండా తిన్నారంటే ఫ్యాట్ కరిగిపోయి నాజూకు అందం మీకు సొంతం అవుతుంది. వాటి వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు. అవేంటంటే..


పెసరపప్పు


ముఖ్యమైన విటమిన్లు ఏ, బి, సి, ఇ, కాల్షియం, ఐరన్, పొటాషియంతో పాటు అనేక ఖనిజాలు పెసర పప్పులో ఉంటాయి. వీటినే మూంగ్ దాల్ అని కూడా అంటారు. ఇందులో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. అదనంగా ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పెసలు మొలకెత్తిన గింజలుగా తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. 


మిరపకాయలు


పచ్చి మిరపకాయలు కొవ్వుని ఇట్టే కరిగించేస్తాయి. అమ్మో మంట అని పక్కన పెట్టేస్తారు కానీ.. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే థర్మోజెనిక్ పదార్థం జీవక్రియను పెంచుతుంది. జీవక్రియ రేటుని పెంచడం ద్వారా కొవ్వుని కరిగించేందుకు సహకరిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం మిరపకాయలని తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు 23 శాతం పెరుగుతుందని తేలింది.


యాలకులు


మిరియాలు “కింగ్ ఆఫ్ స్పైసెస్” అయితే యాలకులని “క్వీన్ ఆఫ్ స్పైసెస్” అని పిలుస్తారు. ఇవి శరీర ఉష్ణోగ్రతని పెంచడం ద్వారా జీవక్రియని వేగవంతం చేస్తాయి. జీర్ణక్రియని పెంచుతాయి. పొట్ట సంబంధిత సమస్యలకి చక్కని నివారణ. ఎన్నో ఔషధ గుణాలన్న యాలకులు టీలో వేసుకుని తాగితే రుచి అద్భుతంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిక్ రోగులు వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.  


కరివేపాకు


మంచి సువాసన ఇచ్చే కరివేపాకు కూరల్లో అయితే వేసుకుంటారు కానీ.. చాలా మంది తినకుండా పక్కన పెట్టేస్తారు. కానీ వీటిని తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని కరిగించి, టాక్సిన్స్ ను బయటకి పంపించేస్తుంది. అంతే కాదు కరివేపాకు హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలని కూడా తగ్గిస్తుంది. అధిక బరువుతో బాధపడే వాళ్ళు కరివేపాకు తింటే మంచిది.


గ్రీన్ టీ


బరువు తగ్గాలని అనుకోగానే ముందుగా ఎంచుకునేది గ్రీన్ టీ. ఇది జీవక్రియని పెంచడం ద్వారా బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తుంది. క్యాన్సర్ తో పోరాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇది ఆకలిని అణిచివేస్తుంది. ఫలితంగా తక్కువ తింటారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: శీతాకాలంలో గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే