Amazing Train Journey Routes in India:భారతదేశంలో రైల్వే మార్గాలు, అవి వెళ్లే రూట్లు అద్భుతమనే చెప్పాలి. వివిధ రకాల ట్రైన్ రూట్‌లలో జర్నీ చేయడం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. ప్రయాణ సాధనాలు ఎన్ని ఉన్నా ట్రైన్ జర్నీ అంటేనే అదో రకం కిక్కు. అయితే భారతదేశంలో ట్రైన్ ప్రేమికులు కచ్చితంగా ప్రయాణించ వలసిన నాలుగు మార్గాలు గురించి చెబుతూ ఉంటారు. ఆ రూట్లలో ప్రయాణం ఒక అద్భుతం అనేది వారి సూచన. మరి ఆ రూట్లేంటో చూసేద్దామా.

Continues below advertisement

1) జోద్‌పూర్ - జైసల్మేర్ (థార్ ఎడారి గుండా ప్రయాణం) 

భారతదేశంలోని ఏకైక ఎడారి "థార్ ". రాజస్థాన్లోని ఈ ఎడారి గుండా ఒక రైలు మార్గం ఉంది. అక్కడ నివసించే ప్రజలకు ఇదే ప్రధానమైన రవాణా మార్గం. జోద్‌పూర్ నుంచి జైసల్మేర్ వరకూ 300 కిమీ దూరం ప్రయాణించే రైళ్లలో ప్రయాణం టూరిస్టులకు కొత్త అనుభూతినిస్తుంది. జోద్‌పూర్‌లో రెండు స్టేషన్‌లు ఉన్నాయి. ఒకటి జోద్‌పూర్, రెండు భగత్‌కి కోఠి. ఈ రెండు స్టేషన్‌ల నుంచి జైసల్మేర్‌కు 6 రైళ్లు నడుస్తాయి. వాటిలో డే టైం వెళ్ళేవి నడిచేవి 3. ప్రయాణ సమయం ఆరు గంటలు. పూర్తిగా ఎడారి నడుమ నడిచే ఈ రైళ్లలో వెళుతూ ఎడారి అందాలు చూడడం ఒక అనుభూతి. హైదరాబాద్ నుంచి జోద్‌పూర్‌కి రెండు, విజయవాడ నుంచి 4 డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి.

2) విజయవాడ/హైదరాబాద్ -గోవా (దూధ్ సాగర్ జలపాతం మీదుగా ప్రయాణం )

రైల్వే ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే కొంకణ్ రైల్వేలో అడవులు, గుహలు, కొండలు దాటుకుంటూ చేసే ప్రయాణం లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ అంటారు టూరిస్ట్‌లు. ముఖ్యంగా గోవా రూట్లో వాస్కోడాగామా స్టేషన్‌కు 50 km దూరంలో తగిలే దూద్ సాగర్ (పాల సముద్రం ) జల పాతం చూస్తూ ట్రైన్‌లో ప్రయాణం చేయడం నిజంగా ఒక అద్భుతమే. కర్ణాటక -గోవా బోర్డర్‌లో ఉండే ఈ జలపాతాన్ని చూడడానికి ఇదే మంచి సీజన్. అక్టోబర్ నుంచి మార్చి మధ్య ఈ రూట్లో వెళ్లే ట్రైన్ ప్రయాణికులకి దూద్‌సాగర్ జలపాతం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుంది. హైదరాబాదు నుంచి గోవాకు 4, విజయవాడ నుంచి 1 డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి.

Continues below advertisement

3) మండపం -రామేశ్వరం(సముద్రంఫై సాహస రైళ్లు) 

నదులపై ప్రయాణించే రైళ్ళను మనం రెగ్యులర్‌గా చూస్తాం కానీ సముద్రంపై ప్రయాణించే ట్రైన్ జర్నీ అనుభూతి చెందాలంటే తమిళనాడులోని మండపం -రామేశ్వరం మధ్య ఉన్న పంబన్ బ్రిడ్జ్‌ఫై వెళ్ళాల్సిందే. జస్ట్ 17 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు స్టేషన్ల మధ్య రైలు ప్రయాణించడానికి గంట సమయం తీసుకుంటుంది. కారణం ఈ రెండు స్టేషన్‌ల మధ్యలో ఉన్న సముద్రం. 2 కిమీ దూరం ఉన్న పంబన్ బ్రిడ్జ్‌ఫై రైలు సముద్రాన్ని దాటుతున్న సమయంలో బలమైన గాలులు వీస్తూ ఉంటాయి. ఒకే అనందాన్ని, గగుర్పాటు కలిగించే అద్భుత ప్రయాణమిది. విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి రామేశ్వరానికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నా అవన్నీ రామేశ్వరం వెళ్లే సరికి చీకటి పడిపోతుంది. కాబట్టి ముందుగా మండపం వెళ్ళిపోయి అక్కడి నుంచి డే టైమ్ ట్రైన్‌లో వెళ్లడం బెటర్. తిరుపతి నుంచి కూడా రామేశ్వరానికి డైరెక్ట్ ట్రైన్ ఉంది.

5) శ్రీనగర్ -కాట్రా ట్రైన్.. (మంచు కొండల్లో మహాద్భుతం)

హిమాలయాల్లో మంచును చూస్తూ ట్రైన్ జర్నీ చేయడం.. ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఇటీవల కొత్తగా నిర్మించిన శ్రీనగర్ రైలు మార్గంతో ఆ అద్భుతం నిజమైంది. పూర్తిగా మంచుతో కప్పిన మార్గంలో ఎత్తైన పర్వతాలు, పెద్ద పెద్ద సొరంగాలు, ఎక్కడో లోతుల్లో ప్రవహించే నదులు, భయంకరమైన లోయల గుండా 200km దూరం ప్రయాణిస్తుంది ఈ రైలు మార్గం. అదే శ్రీమాతా వైష్ణో దేవి కాట్రా నుంచి శ్రీ నగర్ వెళ్లే రైల్వే రూట్. కాట్రా నుంచి శ్రీనగర్‌కు రెండు వందే భారత్‌లు నడుస్తున్నాయి. ఇవికాక శ్రీనగర్ -బారాముల్లా లైన్‌లో కూడా కొన్ని పాసింజర్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఎలా వెళ్లినా ఈ జర్నీ మాత్రం నిజంగా ఒక మహాద్భుతమే అంటారు ఈ రూట్లో వెళ్లిన వారు. హైదరాబాద్ నుంచి కాట్రాకు ఒకటి, విజయవాడ నుంచి 3 డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి.