శరీరంలో రక్తానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్, పోషకాలు తీసుకుని వెళ్ళేది రక్తమే. అందుకే రక్తప్రసరణ ఖచ్చితంగా జరగాలి. లేదంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్తంలోని ఎర్ర రక్త కణాలు శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ని రవాణా చేయడంలో సహాయపడతాయి. శరీర సాధారణ పనితీరుకి ఇది చాలా ముఖ్యమైనది. రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాలి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి రక్తానికి అవసరమైన పోషకాల్ని అందించి ఆరోగ్యకరమైన రక్తప్రవాహానికి ఈ ఆహారాలు డైట్లో చేర్చుకుంటే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.


☀ విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది. ఐరన్, విటమిన్ సి తో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే శరీరమంతా ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.


☀ ఐరన్ అధికంగా ఉండే వీట్ గ్రాస్ జ్యూస్, బ్లాక్ స్ట్రాప్, మొలాసిస్, కిడ్నీ బీన్స్, టోఫు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి.


☀ బచ్చలికూర, కాలే, బ్రకోలి వంటి ఆకుపచ్చని ఆకుకూరలు ఆరోగ్యకరమైన రక్తానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.


☀ ఆరెంజ్ జ్యూస్, ఖర్జూరం, తేనె, ఎండు ద్రాక్ష, ప్రూనే జ్యూస్ అన్నింటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ల అందించే గొప్ప వనరులు. మీ రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడతాయి.


☀ ఆమ్లాకి, మంజిష్ట, గుడుచీ వంటి మూలికలు రక్తప్రవాహానికి తోడ్పడతాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి.


ఐరన్ రిచ్ ఫుడ్స్, మూలికలు తీసుకోవడం వల్ల రక్తం బాగుంటుంది. శరీర పనితీరుకి ఏ ఆటంకం కలగకుండా చూసుకుంటుంది. ఆహారాలతో పాటు రక్తం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం కూడా ముఖ్యమే. జాగింగ్, స్విమ్మింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండెలోని మురికిని లేదా మలినాలను బయటకి పంపుతుంది. గుండె నుండి ఇతర అవయవాలకు రక్తం ఎటువంటి ఆటంకం లేకుండా ప్రసరణ జరిగేలా చేస్తుంది.


సరిపడినంత రక్తం లేకపోతే రక్తహీనత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్త సరఫరా సరిగా జరగకపోతే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. తరచూ జ్వరం రావడం, చలిగా అనిపించడం, పాదాలు, చేతులు తిమ్మిర్లు, శరీరంలో నీరు చేరడం వంటివి జరుగుతాయి. నీరు చేరడాన్ని ఎడిమా అంటారు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. చర్మం తెల్లగా పాలిపోయి కనిపిస్తుంది. ఎంత తిన్నా కూడా నీరసంగా కళ్ళు తిరిగడం, మైకం, ఒళ్ళు నొప్పులు అధికంగా ఉంటాయి. అందుకే పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటూ రక్త ఉత్పత్తిని పెంచుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: చిరుధాన్యాలు ఇలా తిన్నారంటే ఆరోగ్య సమస్యలు తప్పవు, అందుకే ఈ జాగ్రత్తలు తప్పనిసరి