గుండె, కీళ్ళు, శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే ఊపిరితిత్తులకు కూడా కాలక్రమేణా వయస్సు పెరుగుతుంది. అవి బలాన్ని కోల్పోవడం వల్ల శ్వాస తీసుకోవడం సవాలుగా మారే పరిస్థితి ఎదురవచ్చు, అందుకే వాటి మీద శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తులకి సంబంధించిన అంతర్లీన ఆరోగ్య పరిస్థితిని సూచించే లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల పరిస్థితిని గుర్తించించడం కష్టం అవుతుంది. కానీ మీలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే మాత్రం అసలు నిర్లక్ష్యం చేయవద్దని అంటున్నారు నిపుణులు.
ఛాతీ నొప్పి: చాలా మందిలో ఛాతీ నొప్పి తరచూ వస్తుంది. అది బలహీనత వల్లేమో అని అనుకుంటారు. కానీ ఛాతీ నొప్పి నెల లేదా అంతకంటే ఎక్కువ కాలం వస్తూనే ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి ఊపిరి పీల్చుకున్నప్పుడు లేదా దగ్గినప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటే తప్పనిసరిగా వైద్యులని సంప్రదించాలి. లేదంటే ఊపిరితిత్తుల వ్యాధి మరింత తీవ్రతరం అవుతుంది.
దీర్ఘకాలికంగా కఫం: శ్లేష్మం లేదా కఫం ఎక్కువ రోజులు ఉన్నా ఊపిరితిత్తుల ఆరోగ్యం బాగోలేదని చెప్పే సంకేతమే. ఇది ఇన్ఫెక్షన్లని ఎక్కువ చేస్తుంది. శ్లేష్మం ఎక్కువ కాలం ఉంటే విస్మరించొద్దు.
అకస్మాత్తుగా బరువు తగ్గడం: ఎలాంటి డైట్ లేదా వర్కవుట్ లేకుండానే విపరీతంగా బరువు తగ్గుతున్నారు. అయితే అది మీలో కణితి పెరుగుతోందని చూపిస్తూ శరీరం పంపించే ఒక సంకేతం కావచ్చు. ఇటువంటి లక్షణం కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం మంచిది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: వాతావరణంతో సంబంధం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే అది ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతం కావచ్చు. ఊపిరితిత్తుల్లో కణితి లేదా కార్సినవమా నుందహి ద్రవం ఏర్పడటం వల్ల గాలి తీసుకునే మార్గాన్ని అడ్డుకుంటుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది.
నిరంతర దగ్గు: ఎనిమిది వారాలు లేదా ఎక్కువ కాలం పాటు దగ్గు వస్తే అది ప్రమాదకరం. అలాగే దగ్గుతున్నప్పడు రక్తం పడటం కూడా శ్వాసకోశ వ్యవస్థ సరిగా లేదని చెప్పే సంకేతంగా పరిగణించాలి.
ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచే ఆహారం
ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తులు పనితీరు సక్రమంగా ఉండాలి. అందుకే వాటి ఆరోగ్యం కోసం ఈ ఆహార పదార్థాలు డైట్లో భాగం చేసుకుంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి బయటపడొచ్చు.
☀మిరియాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాని ప్రోత్సహిస్తుంది. వాపుని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
☀పసుపులో ఏంటి ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరుకి సహాయపడతాయి.
☀అల్లం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ని తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది.
☀అధిక ఫైబర్ గుణాలు కలిగిన బార్లీ తీసుకుంటే మంచిది.
☀బచ్చలికూర, కాలే వంటి ఆకుకూరల్లో కెరొటీనాయిడ్లు, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు లభిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉన్నాయి. ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తాయి.
☀ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన వాల్ నట్స్ ఊపిరితిత్తుల వాపుని తగ్గించి శ్వాస సాఫీగా ఉండేలా మెరుగుపరుస్తాయి.
☀ఊపిరితిత్తుల సమస్యలతో పోరాడటానికి సహాయపడే గుణం వెల్లుల్లిలో మెండుగా ఉంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.