నోరూరించే వంటకాలు కళ్ళెదుట కనిపిస్తే లాగించేయకుండా ఉంటారా చెప్పండి. వాటిని ఎప్పుడెప్పుడు ఆరగించేద్దామా అని ఎదురు చూస్తారు. ఇక రెస్టారెంట్ లో బఫె చూస్తే అసలు ఆగరు. రకరకాల వంటలు పళ్ళెం నిండా ఉన్నాయంటే ఆబగా తినేస్తారు. అలా చేశారంటే మాత్రం అనారోగ్య సమస్యలు రావడం ఖాయం. అందుకే బఫెలో పెట్టె కొన్ని ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. ఒకేసారి రకరకాల ఆహార పదార్థాలు తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వచ్చి అవకాశం ఉంది. అందుకే కంటికి నచ్చాయి కదా అని అన్నీ తినేసారంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. 


ఫ్రై వంటకాలు అసలొద్దు 


రెస్టారెంట్ లోని బఫెలో ప్లేట్ లో చూడగానే ఆకర్షించేవి ఫ్రై వంటకాలే. కలర్ ఫుల్ గా కంటికి కనిపిస్తాయి. వెంటనే వాటిని ఆరగించేస్తాం. కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదు. ముక్కలు ఫ్రై చేసేందుకు చౌకగా ఉండే నూనెలని ఉపయోగిస్తారు. అంతే కాకుండా బాగా కాగిన నూనెలో వేర్వేరు పదార్థాలు ఫ్రై చెయ్యడం జరుగుతుంది. అందుకే ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ప్రమాదం. 


మొలకెత్తిన విత్తనాలు 


మొలకెత్తిన విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ బఫెలో వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం. మొలకలు తడిగా ఉన్న వాతావరణంలో పెరుగుతాయి. ఎక్కువ మందికి వాటిని సర్వ్ చేయాల్సి వచ్చినప్పుడు విత్తనాలని పూర్తిగా శుభ్రం చేయడం కొంచెం కష్టమైన పని. అందువల్ల వాటిలో సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 


పాస్తా సలాడ్ 


బఫెలో పాస్తా సలాడ్ చూస్తే తినకుండా అస్సలు ఆగలేరు. కానీ అది ఎక్కువసేపు బయట నిల్వ ఉంటుంది. మయో ఆధారిత సలాడ్స్ ఎక్కువ సేపు బయట ఉండటం వల్ల బ్యాక్టీరియా చేరి త్వరగా పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 


డ్రెస్సింగ్స్ 


బఫెలో రకరకాల డ్రెస్సింగ్స్ ఉంటాయి. ఇటాలియన్ డ్రెస్సింగ్, హనీ మస్టర్డ్ డ్రెస్సింగ్ మరియు రాంచ్ డ్రెస్సింగ్ వంటి నోరూరించేవి ఉంటాయి. బఫేలో ఉంచిన చాలా డ్రెస్సింగ్‌లలో చక్కెర, సోడియం మరియు ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దాంట్లో త్వరగా బ్యాక్టీరియా చేరుతుంది. ఇవి వేసుకుని తినడం వల్ల అరుగుదల సమస్యలు రావడంతో పాటు ఆరోగ్యం చెడిపోతుంది. 


సుషి(Sushi)


జపనీస్ ఫుడ్ ఇది. కొత్త రుచిని అసాదించే వాళ్ళు దీన్ని తినేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యానికి ఎంతో మంచి ఆహారం ఇది. ఫ్రెష్, నాణ్యమైన సీ ఫుడ్ తో  దీన్ని తయారు చేస్తారు. కానీ బఫెలో దీన్ని పెట్టినప్పుడు అది కంటికి ఫ్రెష్ గా అనిపించకపోవచ్చు. అందుకే బఫెలో దాన్ని విస్మరించడమే మంచిది. 


Also read: ఆడదోమలు మాత్రమే ఎందుకు కుడతాయి? రక్తం లేకుండా అవి బతకలేవా?


Also read: ఆ నటి మెదడులో కొంత భాగం పనిచేయదు, కారణం బ్రెయిన్ అనూరిజం, ఏంటి ఈ సమస్య?