గర్భవతిగా ఉన్నప్పుడు శరీరమే కాదు, మనసూ సున్నితంగా మారిపోతుంది. శరీరంలోని ప్రతి మార్పు గురించి అతిగా ఆలోచిస్తారు.ఆ ఆలోచనలో తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు, కొన్ని తప్పు అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. గర్భధారణ సమయంలో చేయవలసినవి, చేయకూడని వాటివ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. ఈ విషయంలో మహిళలకు అవగాహన అవసరం. గర్భవతి అయ్యాక మీ శరీరంలో విపరీతమైన మార్పులు కలుగుతాయి. హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గుల వల్ల ఆలోచనలు స్థిరంగా ఉండవు. కోపం పెరిగిపోతుంది. చిన్న విషయాలకే చికాకు కలుగుతుంది. బరువు పెరుగుతారు, రొమ్ముల్లోను మార్పులు సంభవిస్తాయి. గర్భవతయ్యాక ప్రతి మార్పులను మీరు స్వాగతించాలి. తల్లి కాబోతున్న వారి కోసమే ఈ కథనం.


ఆహారం స్కిప్ చేయడం
గర్భవతి అయ్యాక కొందరిలో ఆకలి కలగదు, వికారంగా అనిపిస్తుంది. కొందరిలో వాంతులు అవుతుంటాయి. ఈ సమయంలో ఆహారం తినేందుకు ఇష్టపడరు, బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేయడం వంటివి చేస్తుంటారు. ఆహారంపై విరక్తిగా అనిపిస్తుంది. భోజనం అలా దాటవేయడం ఆరోగ్యకరం కాదు. మొదటి నెలలు శిశువులోని అవయవాలు ఏర్పడటానికి చాలా కీలక సమయం. అందుకే కచ్చితంగా ఆహారం తినాల్సిందే. 


బరువుపై ఆందోళన
గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడం సహజం. ఆ బరువును చూసి చాలా మంది ఆందోళన చెందుతారు. హార్మోన్ల  స్థాయిలు నిరంతరం మారడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. బరువు గురించి ఆందోళన చెందకుండా ఉండాలి. మీరు అనవసరంగా ఆందోళన చెందడం వల్ల బిడ్డ పరిస్థితి దిగజారుతుంది. బరువు గురించి ఆలోచించడం మానివేయండి. గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పెరగడమే ఆరోగ్యకరం. 


సెల్ఫ్ మెడికేషన్
అంటే జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా తనకు తానే మందులు వేసుకోవడం. గర్భవతిగా మారాక ఏ సమస్యకైనా వైద్యుడిని సూచన మేరకే మందులు వాడాలి. ఇలా సెల్ఫ్ మెడికేషన్ మంచిది కాదు. కొన్ని మందులు గర్భవతులకు వేసుకోరాదు. 


శారీరక శ్రమ తగ్గించడం
గర్భవతిగా మారాక కొంతమంది పనిచేయడం పూర్తిగా మానేస్తారు. విశ్రాంతి తీసుకుంటేనే మంచిదని భావిస్తారు. నిజానికి ఎంతో కొంత శారీరక శ్రమ గర్భవతులకు అవసరం. తేలికపాటి పనులు, వ్యాయామాలు, నడక వంటివి కొనసాగించాలి. గర్భవతి చురుకుగా ఉండడం చాలా అవసరం. 


వీటివి దూరంగా...
గర్భవతులు కొన్ని జీవనశైలి అలవాట్లకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానం మానివేయాలి. కెఫీన్ అధికంగా తీసుకోకూడదు. అంటే కాఫీ తగ్గించాలన్న మాట. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర నిండిన పదార్థాలు తక్కువ తినాలి. కంటినిండా నిద్రపోవాలి. కూరగాయలు,పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు మెనూలో ఉండేట్టు చూసుకోవాలి.