అబ్బాయిలతో పోలిస్తే ఆడపిల్లలకు త్వరగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వారు ఇంటా బయట కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చిన్నప్పటినుంచి వారికి అండగా నిలవాల్సింది తల్లీతండ్రి. అలాగే వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సింది కూడా వారే. ముఖ్యంగా ఆడపిల్లల్లో రక్తహీనత అధికంగా వస్తుంది. దీనివల్ల వారు చురుగ్గా ఉండలేకపోతున్నారు. మానసికంగానూ వారిపై ఎంతో ప్రభావం పడుతుంది. కాబట్టి ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డ రక్తహీనత సమస్య బారిన పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అబ్బాయిల్లో రక్తహీనత సమస్య చాలా తక్కువ కనిపిస్తుంది. ఆడపిల్లలు ప్రతి నెలా వచ్చే ఋతుస్రావం కారణంగా రక్తహీనత బారిన పడతారు. అంతేకాదు అబ్బాయిలతో పోలిస్తే ఆడపిల్లలు ఆహారాన్ని కూడా తక్కువగా తీసుకుంటారు. దీనివల్లే వారు ఎనీమియా బారిన పడుతూ ఉంటారు. తగినంత ఇనుము వారికి అందితేనే రక్తం ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. వారికి ఇనుము సక్రమంగా అందాలంటే కొన్ని రకాల ఆహారాలను కచ్చితంగా తినిపించాలి.


ఇనుము అధికంగా ఉండే ఆహారాలు ఏమిటో ముందుగా ప్రతి తల్లి తండ్రి తెలుసుకోవాలి. గుమ్మడి గింజలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఉదయం లేవగానే వారికి ఆ గుమ్మడి గింజలను ఇచ్చి తినమని చెప్పండి. రోజుకు గుప్పెడు తినిపిస్తే చాలు, వారం రోజుల్లోనే వారిలో ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి పెరగడం ప్రారంభమవుతుంది. అలాగే క్వినోవా వారానికి రెండు మూడుసార్లు తినిపించడం ఉత్తమం. క్వినోవా అనేది అన్నానికి ప్రత్యామ్నాయం. అన్నం పెట్టే బదులు ఆ పూట క్వినవాతో వండిన అన్నాన్ని పెట్టడం మంచిది. అలాగే చికెన్ లివర్‌ను కూడా తరచూ వారి చేత తినిపించాలి. కొమ్ముసెనగలు బయట లభిస్తాయి. వాటిని నానబెట్టి కుక్కర్లో ఉడకబెట్టి తరువాత పోపు వేసి వాటిని తినిపిస్తే మంచిది. వీటి రుచి కూడా బాగుంటుంది. కాబట్టి పిల్లలు తినడానికి ఇష్టం చూపిస్తారు. పాలతో చేసిన పనీరే కాదు సోయాతో చేసిన పనీర్ కూడా బయట సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. దీన్ని టోఫు అని పిలుస్తారు. దీన్ని ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కూరలా వండి పెట్టడం మంచిది. అలాగే ప్రతిరోజు చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను ఇచ్చి తినిపించండి. ఇందులో కూడా ఐరన్ ఉంటుంది. వారంలో రెండు సార్లు చేపలు తినిపించడం వల్ల ఆడపిల్లలకు అన్ని రకాల పోషకాలు అందే అవకాశం ఉంది. రోజుకు చిన్న బెల్లం ముక్క ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. బెల్లం లో ఇనుము పుష్కలంగా ఉంటుంది.


ప్రతిరోజూ ఒక గుడ్డును ఉడకబెట్టి తినిపించడం మంచిది. అలాగే ఆకుకూరలను రెండు మూడు రోజులకు ఒకసారి తినిపించాలి. పప్పు ప్రతిరోజూ తినిపిస్తే మంచిది. మన శరీరంలో ఇనుము చాలా ముఖ్యమైనది. ఇది అన్ని భాగాలకు ఆక్సిజన్  అందించడానికి, కణాల పెరుగుదలకు ఎంతో అవసరం. కాబట్టి ఇనుము లోపిస్తే ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు ఆహార ప్రాధాన్యత తెలియదు. తల్లిదండ్రులుగా మీరే చొరవ తీసుకొని వారు అన్ని రకాల పోషకాలు తినేలా చూడాలి. 












































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. Gr