కిడ్నీ స్టోన్స్ (Kidney Stones) అంటే మీ కిడ్నీలో లేదా మూత్ర నాళంలో చిన్న స్పటికాల్లాగా ఏర్పడే రాళ్లు.  మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోయి, అవి గట్టిపడి రాళ్ళగా మారిపోతాయి. అవి కిడ్నీలో ఉండిపోవచ్చు లేదా మూత్రం నాళంలోకి వెళ్లి అక్కడ ఇరుక్కుని ఉండిపోవచ్చు. నీటి వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఇలా కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడే వారి సంఖ్య అధికంగానే ఉంది. కిడ్నీలో రాళ్లు ఒకేరోజులో ఒకేసారి ఏర్పడిపోవు. కొన్ని నెలల సమయాన్ని తీసుకుంటాయి. అలా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్న సమయంలో మన శరీరం కొన్ని రకాల లక్షణాలను చూపిస్తుంది. అప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకుంటే ఆ రాళ్ల పరిమాణం పెరగకుండా జాగ్రత్త పడవచ్చు. కేవలం మందుల ద్వారానే అవి కరిగి బయటికి వచ్చేలా చేస్తారు వైద్యులు. 


లక్షణాలు ఇవే...
కిడ్నీలో చిన్న రాళ్లు ఏర్పడడం మొదలైతే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. పొత్తి కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. ఒకవైపు లేదా రెండు వైపులా వెన్నునొప్పి వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపులో లేదా పొత్తికడుపు పై భాగంలో, వెనుక భాగంలో ఆకస్మికంగా నొప్పి వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. ఇలా వచ్చే నొప్పులు మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కావచ్చేమోనని అనుమానించాలి. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా, మంటగా అనిపిస్తుంది ఇలా పదేపదే నొప్పి మంట వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మూత్రం రంగు మారినా కూడా అది కిడ్నీలో రాళ్లకు ప్రారంభ లక్షణంగా భావించాలి. గులాబీ, గోధుమ, ఎరుపు రంగులో మూత్రం రంగు మారితే అది కిడ్నీ స్టోన్ లక్షణమే. వికారం, వాంతులు వంటివి కలుగినా కూడా మూత్రపిండాల్లో రాళ్ల వల్ల అని అనుమానించాలి. కేవలం ఫుడ్ పాయిజనింగ్ వల్లే ఇలా అవుతుందని లేదు. ఆకస్మికంగా జ్వరం వచ్చి తగ్గిపోతూ ఉంటే జాగ్రత్తపడాలి. 


నిజానికి కిడ్నీలో ఏర్పడిన రాళ్లు మూత్ర నాళంలోకి చేరేవరకు ఎటువంటి లక్షణాలను చూపించవు. చిన్నచిన్న రాళ్లు ఎలాంటి నొప్పి లేకుండా శరీరం నుంచి బయటికి పోతాయి. అలా వెళ్లేందుకే అవి మూత్ర నాళంలోకి ప్రవేశిస్తాయి. కానీ పెద్ద రాళ్లు మాత్రం అక్కడే చిక్కుకుపోతాయి. అప్పుడే అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పులు, జ్వరాలు వంటివి వస్తాయి. వాపు వచ్చి వెనుక భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. అప్పుడు వెంటనే చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలికంగా కిడ్నీలకు హాని కలుగుతుంది. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అనేది ఇప్పుడు సాధారణ సమస్యగా మారిపోయింది. ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. తగినంత నీళ్లు తాగకపోవడం వల్ల ఎక్కువగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అలాగే ఆహారపు అలవాట్లు, ఊబకాయం వంటివి కూడా కిడ్నీలో రాళ్లకు కారణంగా చెప్పుకోవచ్చు. తులసి యాపిల్స్, ద్రాక్ష వంటివి తినడం వల్ల మూత్రపిండాలను రక్షించుకోవచ్చు. 


































Also read: నా భర్త నన్ను మోసం చేశాడు, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.