మధుమేహం, అధిక రక్తపోటు ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 10 కోట్ల మందికి పైగా మధుమేహ రోగులు ఉన్నట్టు అంచనా వేశారు. అలాగే 13 కోట్ల మందికి పైగా ప్రీ డయాబెటిస్ తో బాధపడుతున్నట్టు తేలింది. ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్‌కు ముందు దశ. అలాగే హై బీపీతో బాధపడుతున్న వారు 31 కోట్ల మందికి పైగా ఉన్నట్టు అంచనా. ఈ సర్వేను బట్టి మధుమేహం, అధిక రక్తపోటు మనదేశంలో చాపకింద నీరులా పాకేస్తున్నాయి. ఈ రెండూ కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఒక్కసారి వస్తే పూర్తిగా నయం కావడం అనేది జరగదు. భారతదేశాన్ని ఇప్పటికే డయాబెటిస్‌కు రాజధానిగా పిలుస్తున్నారు. హైపర్ టెన్షన్, స్థూలకాయం, హైపర్ కొలస్ట్రొలేమియా వంటి వాటి వల్ల మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు తెలుస్తోంది. 


ఇక మన దేశంలోని ఉన్న రాష్ట్రాల్లో అత్యధిక డయాబెటిక్ రోగులను కలిగి ఉన్న రాష్ట్రం గోవా. గోవాలోనే 26.4 శాతానికి పైగా డయాబెటిక్ రోగులు ఉన్నారు. ఇక అల్పంగా ఉత్తరప్రదేశ్లో మధుమేహరోగులు ఉన్నారు. ఆ రాష్ట్రంలో 4.8 శాతానికి పైగా మధుమేహ రోగులు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి పంజాబ్, చండీగఢ్లో కూడా మధుమేహ రోగుల సంఖ్య అధికంగానే ఉంది.


మధుమేహాన్ని చక్కెర వ్యాధి అని కూడా పిలుస్తారు. వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అంటారు. ఇది శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే ఒక మెటబాలిజం సమస్య. రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోయి శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఒక రుగ్మత. అతిగా మూత్ర విసర్జనకు వెళ్లడం, దాహం విపరీతంగా వేయడం, చూపు మందగించడం, కారణం లేకుండానే బరువు తగ్గడం, బద్దకం పెరగడం ఇవన్నీ కూడా చక్కెర వ్యాధి లక్షణాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం భారతదేశం, అమెరికా, చైనా దేశాల్లోనే అత్యధికంగా మధుమేహం బారిన పడుతున్న వారి జనాభా ఉంది. ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులో ఉంచుకోవడమే.


డయాబెటిస్‌లో మొత్తం నాలుగు రకాల ఉన్నాయి. అందులో ఒకటి టైప్1 డయాబెటిస్, టైప్2 డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్, టైప్1.5  డయాబెటిస్. ఎక్కువమంది టైప్2 డయాబెటిస్ బారినే పడతారు. ఇక గర్భిణీ స్త్రీలలో వచ్చే డయాబెటిస్‌ను జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇది సాధారణంగా ప్రసవం జరిగిన తర్వాత తగ్గిపోతుంది. కానీ మిగతావి మాత్రం జీవితాంతం కొనసాగుతాయి. డయాబెటిస్ వస్తే అనేక సైడ్ ఎఫెక్టులు కూడా వస్తాయి. తీవ్రంగా అలసిపోతారు. గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. మూత్రపిండాలు బలహీన పడతాయి. డయాబెటిక్ రెటినోపతి అని పిలిచే కంటి సమస్యలు కూడా వస్తాయి. డయాబెటిక్ న్యూరోపతి అని పిలిచే నాడీ సమస్యలు కూడా రావచ్చు. అందుకే డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోమని చెబుతారు. అది అదుపులో లేకపోతే త్వరగా మరణం బారిన పడడం ఖాయం. 


Also read: గర్భనిరోధక మాత్రలు అతిగా వాడే మహిళలు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఎక్కువ











































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.