Sweet Potato: చలికాలంలో దొరికే అద్భుత ఆహారం చిలకడదుంప. దీన్ని స్వీట్ పొటాటో అని పిలుస్తారు. ఇది శివునికి ప్రీతిపాత్రమైనదిగా చెప్పుకుంటారు. దీన్ని తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధుమేహ రోగులు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో చిలగడ దుంప ఒకటి. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు, క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడేవారు కూడా చిలగడదుంపలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి బంగాళదుంపల జాతికే చెందినా రుచి మాత్రం తియ్యగా ఉంటుంది. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు దీనిలో అధికంగా ఉంటాయి.
ఇవి తీయగా ఉంటాయి కాబట్టి మధుమేహ రోగులు తినకూడదని చాలామంది అనుకుంటారు. నిజానికి ఇది చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగవు. కాబట్టి ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
ఈ దుంపల్లో ఆంథోసైనిన్స్, బీటా కెరాటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. వీటిలో పోషకాలు కూడా అధికమే. పొట్ట ఆరోగ్యానికి చిలగడ దుంపలు ఎంతో మేలు చేస్తాయి. పేగుల ఆరోగ్యాన్ని ఇవి మెరుగుపరుస్తాయి. ఈ దుంపలో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఈ రెండూ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. పేగు సంబంధిత సమస్యలు రాకుండా ఇవి అడ్డుకుంటాయి. మెదడు పనితీరుకు కూడా చిలకడదుంప మేలు చేస్తుంది.
స్వీట్ పొటాటో ఎన్నో మంచి వంటకాలు చేసుకోవచ్చు. వీటిని నీళ్లలో వేసి ఉడికించి తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే కాల్చుకొని తిన్నా కూడా టేస్టీగా ఉంటాయి. వీటితో స్మూతీలను చేసుకునే వారు కూడా ఎక్కువే. ఏదో రకంగా చిలకడదుంపలను తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.పిల్లలకు ఈ దుంపలు తినిపించడం చాలా అవసరం. ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో స్నాక్స్ సమయంలో వీటిని తినడం అలవాటు చేయండి. వారికి పోషకాహార లోపం రాకుండా ఉంటుంది.
సాధారణ ఆలూ చిప్స్ కన్నా స్వీట్ పొటాటో చిప్స్ తయారు చేసుకుని తినేందుకు ప్రయత్నించండి. ఇవి తీయగా ఉంటాయి. మానసిక సమస్యలు ఉన్న వారు కచ్చితంగా తినాల్సిన ఆహారంలో స్వీట్ పొటాటోలు ఒకటి. ఇవి మానసిక ప్రశాంతతను అందిస్తాయి.
Also read: ఎక్కువ స్క్రీన్ టైమ్ మీ పిల్లల ఆలోచనా శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
Also read: పొట్టిగా ఉండే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.