జీవరాశితో నిండిన భూమిపై ఎన్నో అద్భుతాలు కూడా ఉన్నాయి.  అందులో కొన్ని మానవ గ్రహణ శక్తికి మించినవి.  ఈ చిత్ర విచిత్రమైన సహజ అద్భుతాల గురించి తెలుసుకోవాలని ఎవరికీ మాత్రం ఉండదు.వీటిని చూసేందుకు ఆ ప్రదేశాలకు అందరూ వెళ్లలేరు. కాబట్టి వాటిని చదివి తెలుసుకోవడం ద్వారా ఆనందిస్తారు. అలాంటి వింతల్లో ఒకటి ఈ గ్యాస్ క్రేటర్.దీన్ని గేట్స్ ఆఫ్ హెల్ అని కూడా పిలుస్తారు. తుర్క్ మెనిస్తాన్ దేశంలోని ఎడారిలో దర్వాజా అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలోనే ఉంది ఈ గ్యాస్ క్రేటర్. దీన్ని చాలా మంది నరకానికి ముఖద్వారా అని చెప్పుకుంటారు. 


ఏంటి ప్రత్యేకత?
దర్వాజా గ్రామ సమీపంలో అతి పెద్ద గొయ్యి ఉంది. ఆ గొయ్యిలోనుంచి మంటలు నిరంతరం వస్తూనే ఉంటాయి. అధికారిక నివేదికల ప్రకారం ఆ బిలం నుంచి 50 ఏళ్లుగా మంటలు వస్తూనే ఉన్నాయి. ఈ బిలం ఎలా ఏర్పడింది అనే విషయమైన కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇది ఎలా ఏర్పడిందో ఎంత కాలం నుంచి మండుతూనే ఉందో ఎవరికి తెలియదు. మనుషులు గుర్తించినప్పటి నుంచి మాత్రం ఇది మండుతూనే ఉంది. ఈ బిలం 226 అడుగుల వెడల్పుతో, 98 అడుగుల లోతుతో ఉంటుంది ఇది. 


ఆపివేద్దామని...
ఈ ప్రదేశం ఎంతోమంది భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు పరిశోధనల గమ్యస్థానంగా మారింది. ఈ బిలం ఎప్పుడు ఏర్పడిందో చెప్పే నివేదికలు లేవు, కానీ 1960లో జరిగి ఉండొచ్చని కొంతమంది చెబుతారు. సోవియట్ యూనియన్ కు చెందిన ఇంజనీర్లు దీన్ని సృష్టించారని కూడా అంటారు. కొంతమంది మాత్రం ఇది సహజంగానే భూమిలోకి కుంగిపోయిందని అంటారు. ఈ బిలం సహజ వాయువు క్షేత్రం. అంటే దాన్నుంచి సహజవాయువు ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అందుకే ఆ మంటలు ఆగకుండా మండుతూనే ఉంటాయి.అయితే తుర్క్ మెనిస్తాన్ ప్రభుత్వం చుట్టుపక్కల గ్రామాల పర్యావరణం, ప్రజారోగ్యంపై ఈ మంటలు ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయని అంచనా వేశారు. దానివల్ల  ఈ మంటలను ఎలా అయినా ఆర్పివేయాలని ప్రణాళికలు వేశారు. కాకపోతే ఇప్పటికీ ఆర్పి వేసే పనులు చేపట్టలేదు. ప్రస్తుతం ఆ బిలం మండుతూనే ఉంది. దీన్ని చూడ్డానికి వేలాదిగా పర్యాటకులు వస్తుండడంతో ఆ దేశానికి ఆదాయం వస్తుంది. కొంతమంది ఈ బిలంలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేశారు. 2013లో గ్రీకు దేశానికి చెందిన జార్జ్ కౌర్వనిస్ అనే వ్యక్తి బిలం దిగువకు వెళ్లాడు. ఆ సాహసయాత్ర నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో ప్రసారం కూడా అయింది. 






Also read: ఛాతీ మంట వేధిస్తోందా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనం