కరోనా వైరస్ ప్రపంచంలో వెలుగు చూసినప్పటి నుంచి ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్... ఇలా కొత్త కొత్త వేరియంట్ల రూపంలో మానవాళిపై దాడి చేస్తూనే ఉంది. వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్లు, అవిచ్చిన శక్తితో మానవజాతి ముందుకే అడుగేస్తోంది. కొన్ని రోజుల క్రితం యూకేలో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందని వార్తలు వచ్చాయి. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల మిళితంగా ఏర్పడిన రకంగా దీన్ని పేర్కొంటూ దీనికి ‘డెల్టాక్రాన్’ అనే నామకరణం చేశారు. ఒక వ్యక్తిలో ఈ రెండింటి లక్షణాలు కనిపించడంతో దాని ఉనికిని నిర్ధారించారు.  కానీ కొన్ని రోజులకే అలాంటి వేరియంట్ ఏదీ లేదని, ల్యాబరేటరీలో జరిగిన తప్పిదంగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అది తప్పిదమో లేక అపోహో కాదని, ఆ వేరియంట్ నిజంగా ఉండొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. 


తక్కువ కేసులు...
యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అక్కడి ఆరోగ్య అధికారులు డెల్టా, ఒమిక్రాన్ రెండు వేరియంట్లతో బాధపడుతున్న వ్యక్తిని గుర్తించారు. కేవలం ఒక వ్యక్తిలోనే కాదు కొంతమందిపై ఈ రెండు వేరియంట్లు దాడి చేశాయి. అయితే కేసులు అతి తక్కువగా ఉండడంతో ‘డెల్టాక్రాన్’ను అంత సీరియస్ గా తీసుకోవడం లేదు.  అయితే ఈ డెల్టాక్రాన్ వేరియంట్ యూకేలోనే పుట్టిందా లేక వేరే దేశం నుంచి మనుషుల ద్వారా దిగుమతి అయిందా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. ఇతర ఏ దేశాల్లోనూ ఈ వేరియంట్ బయటపడలేదు. 


కొత్తగా ఉద్భవించిన ఈ వైరస్ వ్యాప్తి చెందే వేగంపై కానీ, వ్యాక్సిన్లు ఎంత మేరకు ఈ వేరియంట్ పై దాడి చేస్తాయన్న విషయంపై కానీ ఇంకా ఎవరికీ అవగాహన లేదు. ప్రస్తుతానికి కేసులు పెద్దగా లేవు కాబట్టి చింతించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు యూకే అధికారులు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాలోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు ప్రొఫెసర్ పాల్ హంటర్ మాట్లాడుతూ యూకే ప్రజలు డెల్టా, ఒమిక్రాన్ జాతులకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని కాబట్టి డెల్టాక్రాన్ వల్ల ముప్పు అధికంగా కలిగే అవకాశం తక్కువేనని అన్నారు. డెల్టా, ఒమిక్రాన్‌లు రెండూ యూకేలో క్షీణ దశలో ఉన్నాయని, ఈ సమయంలో డెల్టాక్రాన్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువేనని అభిప్రాయపడ్డారు. 


Also read: ఉదయాన లేచిన వెంటనే ఈ లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సర్ కావచ్చు, కొత్త అధ్యయన ఫలితం


Also read: ముప్ఫై ఏళ్ల క్రితం మునిగిన గ్రామం తొలిసారి బయటపడింది, వీడియో చూడండి