పరగడుపున స్పూను తేనెను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు పోషకాహార నిపుణులు. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే బరువు తగ్గుతారని అంటారు. తేనె ప్రతి ఇంట్లో ఇప్పుడు కనిపించే పదార్థంగా మారిపోయింది. గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి వాటిలో ఒక స్పూను తేనె కలుపుకొని తాగే అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే చక్కెర కన్నా తేనె ఎంతో ఆరోగ్యకరమైనది. సాధారణ తేనే కిలో 500 నుంచి 600 రూపాయలు ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అతి ఖరీదైన తేనే ఒకటుంది. దాని పేరు ‘ఎల్విష్ తేనె’. కిలో ధర తెలిస్తే వామ్మో అంటూ ఆశ్చర్యపోతారు. కిలో తేనెను కొనాలంటే 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇందులో తక్కువ నాణ్యత గల తేనె కూడా ఉంది. అది కొనాలన్నా కూడా కనీసం 50 వేల రూపాయలు చెల్లించాల్సిందే. ఇది ఎందుకంత స్పెషల్? అంత ధర ఇచ్చి దీన్ని కొనడం వల్ల ఉపయోగం ఏమిటి?
ఈ ఎల్విష్ తేనే ప్రపంచంలో కేవలం ఒకే చోట లభిస్తుంది. అది టర్కీలోని నల్ల సముద్ర ప్రాంతంలో ఉన్న ఒక గుహలో మాత్రమే. ఆ గుహలో పెట్టే తేనె తుట్టే నుంచి మాత్రమే ఈ తేనెను సేకరిస్తారు. ఈ గుహ టర్కీలోని ఒక నగరానికి 1800 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడికి చేరుకొని ఈ కష్టపడి ఈ తేనెను సేకరించడం అంటే మామూలు విషయం కాదు. కేవలం నిపుణులు మాత్రమే ఈ తేనె సేకరణకు వెళ్తారు. ఎవరు పడితే వారు వెళ్లడానికి అనుమతి లేదు. నిష్ణాతులే వెళ్లాలి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే దీన్ని సేకరిస్తారు. ఆ గుహలో అంతా ఔషధ మొక్కలు నిండి ఉంటాయి. ఆ ఔషధ మొక్కలకు పూసిన పువ్వుల నుండే మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనెను తయారుచేస్తాయి. అందుకే ఈ తేనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ తేనే ఇంత ఖరీదు చేస్తుంది. ఈ తేనెను సేకరించాక టర్కీ ఫుడ్ ఇన్స్టిట్యూట్ అధికారులు నాణ్యతను తనిఖీ చేస్తారు. ఆ తర్వాతే వినియోగదారులకు అమ్మేందుకు అనుమతి ఇస్తారు. ఇది టర్కీలో తప్ప మరెక్కడా దొరకదు.
అన్ని తేనెలు చాలా తీపిగా ఉంటే, ఈ తేనె మాత్రం కాస్త చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్నా కూడా ఈ తేనె తినేందుకు ఇష్టపడతారు టర్కీ ప్రజలు. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. అవన్నీ కూడా మన శరీరానికి కావాల్సినవి. ముఖ్యంగా ఔషధ మొక్కలలోని ఔషధ గుణాలు ఈ తేనెలో ఉంటాయి. దీని తాగడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయని అక్కడి వారి నమ్మకం.
మరో తేనె...
ఎల్విష్ తేనెలాంటి అరుదైన తేనే మరొకటి కూడా ఉంది. అది పిట్ కైర్న్ తేనె. దీన్ని కూడా ప్రపంచంలో అత్యంత అరుదైనదిగా, స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. మామిడి, ఫ్యాషన్ ఫ్లవర్, జామ వంటి చెట్లకు పూసే పూలలోని మకరందంతో ఈ తేనెను తయారుచేస్తాయి తేనె తీగలు. అందుకే ఇది అరుదైనదిగా పరిగణించారు. అలాంటిదే మరొక తేనె కూడా ఉంది. సిద్ర్ చెట్టు పెరిగే కొన్ని దేశాలలో భారతదేశం ఒకటి. భారతీయ సిద్ర్ తేనె అందమైన కాశ్మీర్ లోయ నుండి వస్తుంది. కాశ్మీరీ పర్వతాలలో సిద్ర్ చెట్టు పువ్వుల్లోని మకరందంతో తేనెటీగలు సిద్ర్ తేనెను తయారుచేస్తాయి.
Also read: నా భర్త నన్ను మోసం చేశాడు, ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాడు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.