Health Benefits Of Red Wine: మనం తినే ఆహారం, ఆరోగ్యపు అలవాట్లు మన జీవిత కాలాన్ని నిర్ణయిస్తాయి. కొంత మంది అరవై ఏళ్లకే మరణిస్తే, మరికొంతమంది మాత్రం వందేళ్లు పూర్తి చేసుకుంటారు. ఎలాంటి ఆరోగ్యసమస్యలు, చెడు అలవాట్లు లేనివారు మాత్రమే సెంచరీని దాటే అవకాశాలు ఉన్నాయని అంటారు వైద్యులు. ఇంగ్లాండుకు చెందిన ఓ బామ్మ మాత్రం తన దీర్ఘకాలిక జీవితానికి రెడ్ వైన్ తాగడమే కారణమని చెబుతోంది. ఆమె వయసు ఇప్పుడు 108ఏళ్లు. మొన్ననే 108వ పుట్టినరోజు చేసుకుంది.ఆ బామ్మ పేరు జూలీ ఇవర్సన్. 1914లో జన్మించిన ఆమెకు ముగ్గురు కూతుళ్లు, అయిదుగురు మనవరాళ్లు ఉన్నారు. ఆమె కూతుళ్లు కూడా ముసలివారైపోయారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు రోజూ రెడ్ వైన్ తాగే అలవాటుంది. అలాగని అతిగా కాదు. రోజుకో గ్లాసు కచ్చితంగా తాగుతాను. అదే నా ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తోంది’అని చెప్పుకొచ్చింది.
అధ్యయనాలూ చెప్పాయి... (Red Wine Health Benefits)
రెడ్ వైన్ ఆరోగ్యప్రయోజనాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు జరిగాయి. రోజూ మితంగా తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనని ఆ పరిశోధనలన్నీ తేల్చాయి. దీర్ఘకాలంగా రెడ్ వైన్ పరిమితంగా తాగడం వల్ల గుండె సంబంధ వ్యాధుల వల్ల కలిగే మరణాలు తగ్గుతాయని, దాదాపు అయిదేళ్ల పాటూ ఆయుర్ధాయం పెరుగుతుందని కూడా అధ్యయన ఫలితాలు చెప్పాయి. రెడ్ వైన్లో రెస్వెరాట్రాల్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మానవశరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
పూర్వం నుంచే...
క్రీస్తు పూర్వం 6000 సంవత్సరం నుంచే వైన్‌ను తాగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈజిప్షియన్లకు ఆహారం తినేప్పుడు పక్కన రెడ్ వైన్ ఉండాల్సిందే.బీర్లు, మద్యం తాగేవారు త్వరగా మరణించే అవకాశం ఉంది కానీ రెడ్ వైన్ తాగే వాళ్లు మాత్రం ఎక్కువ కాలం జీవిస్తారనే నమ్మకం ఈజిప్టు ప్రజల్లో అధికం. రోజూ రెడ్ వైన్ తాగేవారు మిగతా వారితో పోలిస్తే 34 శాతం తక్కువ మరణశాతాన్ని కలిగి ఉన్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
అందానికీ...
రెడ్ వైన్ రోజూ తాగే వారిలో చర్మం యవ్వనంతో తొణికిసలాడుతుందని చెబుతారు.నిజానికి ఇది కొంతవరకు నిజమే. చర్మం మీద ముడతలు ఏర్పడకుండా అడ్డుకోవడంతో త్వరగా వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేస్తుందట. రెడ్ వైన్ తాగడం ఇష్టం లేని వాళ్లు ద్రాక్ష, బ్లూబెర్రీస్, క్రాన్ బెర్రీస్ వంటి పండ్లు రోజూ తినండి. రెడ్ వైన్ ను వీటితోనే తయారుచేస్తారు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Also read: రోజుకు రెండు ఆపిల్స్ మించి తింటే ఇవిగో ఈ రోగాలొచ్చే అవకాశం