Tasty Breakfast Recipe : సోమవారం మొదలైందంటే చాలు. పిల్లలు స్కూల్​కి పెద్దలు ఆఫీస్​కి వెళ్లాలి. ఆదివారం కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఉదయాన్నే లేవాలంటే బద్ధకంగా ఉంటుంది. ఆ సమయంలో ఏది తినాలన్నా.. వండాలన్నా కష్టంగానే ఉంటుంది. మీరు ఇదే ఫేజ్​లో ఉంటే ఇన్​స్టాంట్​గా ఇంట్లోనే కరకరలాడే దోశలు (Instant Dosa Recipe) రెడీ చేసుకోవచ్చు. వీటిని చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఓ పది నిమిషాలు మీది కాదు అనుకుంటే చక్కగా ఇంటిల్లీపాది వేడి వేడి దోశలు లాగించేవచ్చు. మరి గోధుమ దోశల(Wheat Dosa Recipe) రెసిపీని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


గోధుమ పిండి - అర కప్పు


బియ్యం పిండి - పావు కప్పు


ఉప్పు - తగినంత


ఇంగువ - చిటికెడు


జీలకర్ర - అర టీస్పూన్


కరివేపాకు - 1 రెబ్బ


పచ్చిమిర్చి - 2 


అల్లం - అంగుళం


ఉల్లిపాయ - 1 పెద్దది


పెరుగు - 1 టేబుల్ స్పూన్ 


తయారీ విధానం


ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని బాగా కడిగి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు, ఇంగువ వేసి బాగా కలపాలి. దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నీరు వేస్తూ ఉండలు లేకుండా పిండిని బాగా కలపాలి. దోశలకు పోసుకునే బ్యాటర్​ను సిద్ధం చేసుకునేందుకు అవసరమైన నీటిని వేయాలి. పిండిలో ఉండలు లేకుండా బాగా కలిపాలి. దానిలో పెరుగు కూడా వేసి కలిపి ఓ పది నిమిషాలు పక్కన పెట్టండి.


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై దోశ పాన్ పెట్టండి. అది వేడి అయ్యాక నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న దోశ మిశ్రమాన్ని తీసుకోండి. పిండిని మరోసారి బాగా కలిపి దోశలు పోసుకోండి. అంచులకు కాస్త నూనె వేసి మీడియం మంట మీద దోశలను వేయండి. ఒక వైపు ఉడికిన తర్వాత దోశను మరోవైపు తిప్పి కాల్చండి. దీని అంచులు గోల్డెన్ కలర్, క్రిస్పీగా మారినప్పుడు దోశను తిప్పితే మంచిది. ఇలా చేస్తే కనుక రెండో వైపు కాల్చాల్సిన పని ఉండదు. మిగిలిన పిండితో కూడా ఇలా దోశలు వేసుకోవచ్చు. ఎప్పుడు దోశ వేసిన పిండిని మరోసారి కలుపుతూ ఉండండి. లేదంటే పిండి అడుగు భాగానికి చేరిపోతుంది. 


ఇలా తయారు చేసుకున్న గోధుమ దోశలను మీరు కొబ్బరి లేదా వేరుశనగ చట్నీలతో లేదా పొడులతో కలిపి తీసుకోవచ్చు. ఇవి రుచిలో చాలా బాగుంటాయి. ఉదయాన్నే మీకు మంచి క్రిస్పీ అనుభూతిని ఇస్తాయి. పెరుగు దోశలు గోల్డెన్ కలర్​లో రావడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి చూసేందుకు కూడా ఈ దోశలు ఇంట్రెస్టింగ్​గా కనిపిస్తాయి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హాయిగా తినొచ్చు. 


Also Read : టేస్టీ, హెల్తీ కరివేపాకు పొడి రెసిపీ.. ఇలా చేస్తే నెలరోజులు నిల్వ ఉంటుంది