Health Benefits of Karivepaku Podi : చాలామంది అన్నాన్ని కూరలతో కలిపి తినేముందు ఏదైనా పొడి వేసుకుని ఓ రెండు ముద్దలు తినే అలవాటు ఉంటుంది. మీకు అలాంటి అలవాటు ఉంటే కచ్చితంగా మీ రోటీన్లో కరివేపాకు పొడిని చేర్చుకోవచ్చు. ఇది కేవలం రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. ముఖ్యంగా జీర్ణ సమస్యలున్నవారు తమ భోజనంలో ఇది తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ పొందుతారు. నెలరోజులు నిల్వ ఉంచుకోగలిగే ఈ కరివేపాకు పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఎండు మిర్చి - 15
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు - 10
నువ్వులు - పావు కప్పు
చింతపండు - 100 గ్రాములు
ఉప్పు - తగినంత
కరివేపాకు - 250 గ్రాములు
తయారీ విధానం
ముందుగా కరివేపాకును బాగా కడిగి నీరు పోయేవరకు ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి వాటిని పాన్‌లో వేసి కరకరలాడేవరకు ఫ్రై చేసుకోవాలి. చేతితో నలిపితే పొడిగా అయ్యేతంగా వేయించుకోవాలి. అలా మాడ్చేస్తే దాని రుచి పూర్తిగా పోతుంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టండి. మంటను మీడియంగా ఉంచి దానిలో నూనె వేయండి. అది కాగిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేగనివ్వండి. ధనియాలు, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేయాలి. ఎండుమిర్చి కరకరలాడే వరకు తక్కువ మంటలో వేయించాలి. చివర్లో నువ్వుల గింజలు వేసి వేయించండి. వాటిని గోధమ రంగులో వచ్చే వరకు తక్కువ మంటలో వేయించాలి.
ఇప్పుడు వేయించిన మిరపకాయలను, మసాలా దినుసులను మిక్సీజార్‌లో వేసి పొడిగా చేసుకోవాలి. దానిలో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అనంతరం వేయించిన కరివేపాకు, చింతపండు వేసి పౌడర్‌గా చేసుకోవాలి. అన్ని పదార్థాలు మెత్తగా అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. అంతే కరివేపాకు పొడి రెడీ. దీనిని గాలి చేరని కంటైనర్‌లో ఉంచితే నెలవరకు నిల్వ ఉంటుంది. దీనిని వేడి వేడి అన్నంలో కలిపి కాస్త నెయ్యి వేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
కరివేపాకు లేని కూరలు ఉండవు. దాదాపు అన్ని కూరల్లో దీనిని ఉపయోగిస్తారు. సాంబార్, రసం వంటి వాటిలో దీనిని కచ్చితంగా వేస్తారు. అయితే దీనిని కొందరు కర్రీలలో తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే కరివేపాకు పొడి చేసుకుని తినొచ్చు. దీనిలోని ఔషధ గుణాలు రక్తహీనతను తగ్గిస్తాయి. కరివేపాకులోని ఐరన్ రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది.ముఖ్యంగా ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు ఇది చాలా మంచిది. మధుమేహం ఉన్నవారికి కూడా కరివేపాకు పొడి బెస్ట్ ఆప్షన్. బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటుంది. రెగ్యూలర్‌గా మందులు తీసుకోకపోయినా.. భోజనంలో దీనిని తీసుకుంటే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ రెసిపీని మీరు కచ్చితంగా ట్రై చేయవచ్చు.
Also Read : స్ప్రౌట్స్తో టేస్టీ, క్రిస్పీ దోశలు.. బరువు తగ్గేందుకు చక్కటి రెసిపీ