Healthy Spinach Momos Recipe : మోమోస్ చాలామంది ఇష్టంగా తింటారు. బయట దొరికే మోమోస్ చాలా రుచిగా ఉంటాయి. కానీ అవి ఆరోగ్యానికి మంచివా? కాదా? అని విషయానికొస్తే కచ్చితంగా నో అనే ఆన్సరే వస్తుంది. అలాంటప్పుడు పిల్లలు, కుటుంబం కోసం.. ఇంట్లో తయారుచేసిన మోమోస్ సురక్షితమైనదిగా చెప్పవచ్చు. మీకు ఇష్టమైన స్నాక్స్‌ను ఎలాంటి బాధ లేకుండా తినాలనిపిస్తే.. ఇంట్లోనే పాలకూర మోమోస్ ట్రై చేసేయవచ్చు. ఇవి టేస్టీ, హెల్తీ కూడా.
పాలకూర మోమోస్ రుచికరమైనవి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. అలాగే మీరు మోమోస్ తయారుచేయడానికి మైదాను ఉపయోగించకూడదనుకుంటే గోధుమ లేదా జొన్న పిండిని ఉపయోగించవచ్చు. దీంతో ఇంట్లోనే సులభంగా ఆరోగ్యకరమైన మోమోస్‌ను తయారు చేసుకోవచ్చు.
పాలకూర మోమోస్ రెసిపీ
పాలకూర మోమోస్ తయారు చేయడానికి ముందుగా పాలకూరను బాగా కడగాలి. మట్టి, మురికి పూర్తిగా తొలగిపోతుంది. తరువాత ఒక పాత్రలో నీరు మరిగించి.. అందులో పాలకూర వేసి 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించాలి. ఉడికించిన తర్వాత పాలకూరను చల్లార్చి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. లేదా తురుముకోవాలి. ఈ విధంగా మీ పాలకూర స్టఫింగ్ కోసం సిద్ధంగా ఉంటుంది.
ఇప్పుడు ఒక పాన్‌లో 1 స్పూన్ నూనె వేడి చేయండి. ఇందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వేసి 1-2 నిమిషాలు వేయించాలి. తరువాత తరిగిన క్యారెట్లు, ఆకుపచ్చ బఠానీలు, ముందుగా తయారుచేసిన పాలకూర వేయాలి. 5-7 నిమిషాల పాటు అన్ని కూరగాయలను ఉడికించాలి. తరువాత రుచికి తగినట్లుగా సోయా సాస్, చాట్ మసాలా, ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపాలి. గ్యాస్ ఆఫ్ చేసి మిశ్రమాన్ని చల్లార్చాలి.
పిండి ఎలా మిక్స్ చేయాలంటే..
మోమోస్ తయారు చేయడానికి పిండిని తయారు చేయడం చాలా సులభం. ఒక పాత్రలో గోధుమ పిండి, జొన్న పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి నీళ్లు పోస్తూ మెత్తటి పిండిగా కలుపుకోవాలి. ఈ పిండిని మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టాలి. తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి రోలర్‌తో గుండ్రంగా ఒత్తుకోవాలి. మధ్యలో పాలకూర, కూరగాయల మిశ్రమాన్ని ఉంచి అంచులని మూసివేయండి. మోమోస్‌ను మీకు నచ్చిన ఆకారంలో కూడా తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు ఆవిరి యంత్రంలో నీరు మరిగించి.. మోమోస్‌ను ప్లేట్‌లో ఉంచండి. మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల వరకు ఆవిరి చేయండి. మోమోస్‌ను ఎక్కువగా ఆవిరి చేయకుండా చూసుకోండి. లేకపోతే అవి చాలా మెత్తగా మారవచ్చు. అంతే వేడి వేడి టేస్టీ పాలకూర మోమోస్ రెడీ. వీటిని చిల్లీ సాస్ లేదా టొమాటో సాస్‌తో తీసుకోవచ్చు. మీరు టీ లేదా తేలికపాటి సూప్‌తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యకరమైనవి అంతేకాకుండా చాలా రుచిగా ఉంటాయి. మోమోస్ అంటే ఇష్టముండి బయట తినడానికి ఆలోచించేవారు కచ్చితంగా వీటిని ఇంట్లో ట్రై చేసి తినవచ్చు.